న్యూఢిల్లీ : దేశం కష్టకాలంలో కొనసాగుతున్నప్పుడు సుదూరభవిష్యత్ గురించి “కల్పనలను చిత్రీకరించడం” దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆదివారం వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు చాలా మంది ఇంకా ‘సూపర్ పూర్’లో ఉంటుండగా, సూపర్ పవర్ గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ పిటిఐ ఇంటర్వూలో 2047 నాటికి మనదేశం అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటవుతుందని, ప్రజలు పేదరికంపై విజయం సాధిస్తారని, ఆరోగ్యం, విద్య, సామాజిక రంగాల్లో ప్రపంచం మొత్తం మీద ఉత్తమస్థాయిలో ఉంటామని,
అవినీతి, కులమత బేధాలకు దేశ జీవనంలో చోటు ఉండదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని మోడీ విజన్ 2047 ని దృష్టిలో పెట్టుకుని థరూర్ వ్యాఖ్యలు చేశారు. అధికద్రవ్యోల్బణం, స్వల్పస్థాయిలో ఉపాధి, రికార్డు స్థాయిలో నిరుద్యోగం, వీటన్నిటితోపాటు ప్రజలకు ఉద్యోగాలే లేకుంటే అధికధరలకు నిత్యావసరాలను ప్రజలు ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో సుదూర భవిష్యత్ గురించి అంటే ఇప్పటి నుంచి వచ్చే 25 ఏళ్ల గురించి కల్పనలను చిత్రీకరించడం దురదృష్టకరంగా థరూర్ వ్యాఖ్యానించారు.