చెన్నై: ఎఐఎడిఎంకె బహిష్కృత నాయకురాలు వికె శశికళ సోమవారం సాయంత్రం తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను పరామర్శించారు. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని ఆయన నివాసానికెళ్లి పరామర్శించినట్టు శశికళ సన్నిహితులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌లో రజినీకాంత్‌కు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. గుండె నుంచి మెదడుకు రక్త సరఫరాలో ఏర్పడ్డ అడ్డంకుల్ని తొలగించేందుకు ఆ శస్త్ర చికిత్స నిర్వహించారు. దాంతో, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు శశికళ వెళ్లినట్టు చెబుతున్నారు. ఇటీవలే రజినీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా బహూకరించారు. రజినీకి శశికళ అభినందనలు తెలిపారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనంతరం ఈ ఏడాది జనవరిలో శశికళ విడుదలైన విషయం తెలిసిందే. జయలలిత మరణానంతరం ఎఐఎడిఎంకెలో జరిగిన నాటకీయ పరిణామాల్లో 2017లో ఆమె ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి శశికళ వస్తారన్న ఊహాగానాల మధ్య ఆమె కదలికల్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.