పాట్నా : దేశానికి తరువాతి ప్రధానిగా మమతాబెనర్జీ ఉంటే బాగుంటుందని రాజకీయ నాయకుడైన నటుడు శత్రుఘ్నసిన్హా తన అనుకూలత వెల్లడించారు. పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ నేతృత్వం లోని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడైన శత్రుఘ్నసిన్హా ఒక ప్రశ్నకు సమాధానంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భవిష్య ప్రధానిగా రాహుల్ కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఎలా పరిగణిస్తారు ? అన్న ప్రశ్నకు ఆయన ఒక మహిళ దేశాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో ప్రధానిగా ఒక మహిళగా ఉంటే బాగుంటుందని పేర్కొన్నారు.
ఫైర్‌బ్రాండ్ మమతాబెనర్జీకి ప్రజల్లో ఆదరణ ఉందన్నారు. విపక్ష కూటమి ఇండియాలో ప్రతిభకు లోటు లేదని, భావి ప్రధాని ఎవరో అన్నది సరైన సమయంలో తీసుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు. యువనేత రాహుల్ గాంధీ, ఆయనలో దేశం భవిష్యత్తు చూస్తోందని, అలాగే ఆధునిక చాణక్య శరద్ పవార్, మాస్ లీడర్ మమతా బెనర్జీ తదితరులు మనకు ఉన్నారని పేర్కొన్నారు.