కోల్‌కతా: నటుడి నుంచి రాజకీయవేత్తగా మారిన శతృఘ్న సిన్హా పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని మెచ్చుకున్నారు. అదానీ గ్రూప్ స్టాకుల పతనాన్ని రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రశ్నించారు. శతృఘ్న సిన్హా శుక్రవారం రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ట్వీట్ కూడా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన శతృఘ్న సిన్హా అసన్‌సోల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని మోడీ జవాబులు ఇవ్వకుండా దాటవేసి ప్రసంగించిన వైనాన్ని కూడా ఆయన ఎద్దేవ చేశారు.
ఇదిలావుండగా శతృఘ్న సిన్హా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ శంతను సేన్ అన్నారు. అవి తృణమూల్ కాంగ్రెస్ అభిప్రాయాలను ప్రతిబింబించవన్నారు. ‘మేము చెప్పాలనుకుంటోంది ఏమిటంటే వారు భారత్ జోడో యాత్ర బాగా నిర్వహించారు. అదే సమయంలో వారు పార్టీని ఐక్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు’ అన్నారు.
రాహుల్ గాంధీని శతృఘ్న సిన్హా మెచ్చుకోవడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు జనవరి 9న కూడా ఇలాగే రాహుల్ గాంధీని ప్రశంసించారు. రాహుల్ గాంధీ యూత్ ఐకాన్‌గా ఎదిగారన్నారు. తనను ఏమి తెలియని ‘పప్పు’గా ప్రొజెక్ట్ చేసిన బిజెపిని ఏకి పారేశారన్నారు. భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్, తృణమూల్‌ను కోరినప్పటకీ పార్టీ నాయకత్వం తిరస్కరించిందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను శతృఘ్న సిన్హా ప్రశంసించడం తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వానికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
We all heard the hon'ble PM @narendramodi 1.5hrs long speech in Parliament, but unfortunately it lacked substance & didn't answer any of the questions raised by the dynamic, youth icon @RahulGandhi. People are all praise for Rahul Gandhi
— Shatrughan Sinha (@ShatruganSinha) February 10, 2023