ఉగ్రవాదులను హతమార్చడంలో
ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు..
కెప్టెన్ అశుతోష్‌కుమార్‌కు మరణానంతరం
న్యూఢిల్లీ: 2021 స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆరుగురు సైనికులను శౌర్యచక్ర అవార్డుకు ఎంపిక చేశారు. గతేడాది జమ్మూకాశ్మీర్‌లో చేపట్టిన యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో ఒకరు మరణానంతరం ఈ అవార్డుకు ఎంపికయ్యారు. శాంతికాలంలో సైన్యానికిచ్చే గ్యాలంటరీ అవార్డుల్లో ఈ అవార్డు మూడోస్థానానికి చెందింది. మేజర్ అరుణ్‌కుమార్‌పాండే,మేజర్ రవికుమార్‌చౌదరి,కెప్టెన్ వికాస్ ఖత్రీ,రైఫిల్‌మ్యాన్ ముకేశ్‌కుమార్,సిపాయి నీరజ్ అహ్లావత్,కెప్టెన్ అశుతోష్‌కుమార్(మరణానంతరం) ఈ అవార్డుకు ఎంపికయ్యారు. బార్ టు సేనా మెడల్‌కు నలుగురిని, సేనా మెడల్‌కు 116మందిని ఎంపిక చేశారు. గతేడాది నవంబర్ 8న చేపట్టిన యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో తోటి సైనికుడిని కాపాడటం కోసం అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి కరడుగట్టిన ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టిన కెప్టెన్ అశుతోష్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. మద్రాస్ రెజిమెంట్ 18వ బెటాలియన్‌కు చెందిన అశుతోష్ ఆ రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మరణించారు.
ముగ్గురు కోబ్రా కమాండర్లకు
శౌర్యచక్ర, మావోయిస్టుల అణచివేతలో కీలక పాత్ర
శౌర్యచక్రకు సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ముగ్గురు కోబ్రా కమాండోలను కూడా ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చత్తీస్‌గఢ్‌లో కరడుగట్టిన నలుగురు మావోయిస్టుల్ని హతమార్చినందుకు ఈ అవార్డుకు వారిని ఎంపిక చేసినట్టు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొన్నది. డిప్యూటీ కమాండెంట్ చిటేశ్‌కుమార్, సబ్‌ఇన్‌స్పెక్టర్ మంజీందర్‌సింగ్, కానిస్టేబుల్ సునీల్‌చౌదరిలను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 2019 సాధారణ ఎన్నికలకు ముందు(మార్చి 26న) సుకుమా జిల్లాలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లను హతమార్చడంలో వీరు సాహసోపేతంగా వ్యవహరించారని అధికారులు తెలిపారు. చనిపోయిన నక్సలైట్ల నుంచి ఓ ఇన్సాస్ రైఫిల్‌తోపాలు, ఇతర ఆయుధాలను సిఆర్‌పిఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర పోలీస్ విభాగాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మరో 1380మందికి సర్వీస్ మెడల్స్‌ను కేంద్రం ప్రకటించింది.