నల్గొండ: ప్రేమించాడు… పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. దీంతో ఇద్దరు కలిసి సహజీవనం చేశారు… ఈ జంటకు కూతురు పుట్టిన తరువాత పెళ్లి చేసుకోనని ప్రియుడు నిరాకరించడంతో అతడి ఇంటి ఎదుట యువతి ధర్నా చేసిన సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సరోజ-వెంకటేష్ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. వాళ్ల స్నేహం ప్రేమగా మారింది. వెంకటేష్ హైదరాబాద్‌లో బిటెక్ చదువుతున్నాడు. సరోజ కంప్యూటర్ నేర్చుకొని హైదరాబాద్‌లో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. దీంతో ఇద్దరు కలిసి హైదరాబాద్‌లో రూమ్ తీసుకొని సహజీవనం చేస్తున్నారు. దీంతో యువతి గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని వెంకటేష్‌ను నిలదీసింది. గ్రామంలో తెలిస్తే పరువుపోతుందని అబార్షన్ చేయించాడు.
నెలలు నిండడంతో కూతురు జన్మించింది. పాపను తన బావ నరసింహా దగ్గర ఉంచుదామని తెలిపాడు. ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. తన సోదరి వివాహం జరిగిన తరువాత పెళ్లి చేసుకుంటానని పెద్ద మనషుల సమక్షంలో వెంకటేష్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. వివాహ వేడుక జరిగిన తరువాత వెంకటేష్ ఎవరికీ తెలియకుండా వెళ్లిపోవడంతో బాధితురాలు మునగాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంకటేష్‌ను పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చారు. వెంకటేష్ పెళ్లి చేసుకోనని నిరాకరించడంతో యువతి వెంకటేష్ ఇంట్లోనే ఉంటుంది. దీంతో వెంకటేష్, కుటుంబ సభ్యులు తన బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. వెంకటేష్ తన బంధువులతో ఇంటికి చేరుకొని ఆమెపై దాడి చేసి బయటకు గెంటేశాడు. దీంతో అతడి ఇంటి ముందు ఆమె ధర్నాకు దిగింది.