అన్ని విధాల ఆదుకుంటున్న షీటీమ్స్
బతుకుపై భరోసా కల్పించి స్వయం ఉపాది కల్పిస్తున్న
47మంది విద్యా, 78మందికి పునరావాసం
121మందికి వివిధ వృత్తుల్లో శిక్షణ
2021లో 178మందిపై కేసులు నమోదు
మనతెలంగాణ, సిటిబ్యూరో: వివిధ రకాల వేధింపులకు గురవుతున్న బాధితులకు హైదరాబాద్ భరోసా సెంటర్ అండగా నిలుస్తోంది. బాధితులకు వైద్య సాయంతోపాటు అన్ని రకాలుగా ఆదుకుంటోంది. వేధింపులకు గురవుతున్న బాధితులు చేస్తే వెంటనే స్పందించడమే కాకుండా వారికి కావాల్సిన సాయం చేస్తోంది. గతంలో సవతి తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదురు కాగా భరోసా సెంటర్ బాధితురాలికి విముక్తి కల్పించింది. అంతేకాకుండా బాలికకు ఉన్నత విద్య చదివేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. దీంతో బాలిక చదువులో మంచి ప్రతిభ చూపి ఇప్పుడు సిఏ చేస్తోంది.
ఇలా ఇప్పటి వరకు భరోసా సెంటర్‌కు వచ్చిన 47 మంది బాధితులకు విద్యాబుద్దులు నేర్పుతున్నారు. విద్యతోపాటు ఏదిక్కులేని వారికి పునరావాసం కల్పిస్తోంది, ఇప్పటిరకు 78మందికి షెల్టర్ కల్పించింది. 15మంది బాలికలను షెల్టర్ హోంకు తరలించారు. 63మందికి కావాల్సిన వైద్యాన్ని ఉచితంగా అందిస్తోంది. స్వయం ఉపాధి ద్వారా వారి కాళ్లపై వారు నిలబడేందుకు 121మందికి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తున్నారు. భరోసా సెంటర్ 2019లో యువతులను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్న 118మందిపై కేసులు నమోదు చేశారు, 2021లో 178మందిపై ఎఫ్‌ఐఆర్ చేశారు. 2019లో116 పెట్టీ కేసులు, 2021లో 228 కేసులు నమోదు చేశారు. వేధింపులకు గురిచేస్తున్న వారిని డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి 2019లో 130మందిని, 2021లో 359మందిని పట్టుకున్నారు. రోడ్లు, బస్టాండ్లలో ఉంటున్న పోకిరీలకు 2019లో 1,328మంది, 2021లో 649మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
అభాగ్యులకు అండగా…
తెలంగాణ రాష్ట్రంలో భరోసా సెంటర్‌ను మొదటి సారిగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి వేధింపులకు గురవుతున్న మహిళలు, యువతులకు అండగా నిలుస్తోంది. వారికి ధైర్యం కల్పిండమే కాకుండా స్వయం శక్తిపై నిలిచేందుకు పలు ఉపాధి కోర్సులకు శిక్షణ ఇస్తోంది. ఇలా చేయడం వల్ల చాలామంది బాధితులు పనిచేసుకుంటు జీవిస్తున్నారు. గృహహింసపై మహిళలకు అండగా ఉంటోంది. బాధితులు ఫోన్ చేసిన వెంటనే స్పందించి వారికి భరోసా కల్పిస్తున్నారు. అత్యాచారానికి గురైన వారికి కౌన్సెలింగ్, మెడికల్ సాయం అందజేసి వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ అత్యాచారం బాధితురాలికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో జరిగిన గోరాన్ని షీటీమ్స్‌కు వివరించింది. బాధితులకు ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి కల్పిస్తోంది.
గుడ్ టచ్….బ్యాడ్ టచ్…
పాఠశాల బాలకలు చాలామందికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియకపోవడంతో చాలా వేధింపులు బయటికి రావడంలేదు. దీంతో చాలామంది బాధితులు లోపలే కుమిలిపోతున్నారు. దానిని పలు కేసుల్లో బయటపడడంతో భరోసా సెంటర్ నగరంలోని పలు పాఠశాలల ఉపాధ్యాయులకు వీటిపై శిక్షణ ఇస్తోంది. బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పడమే కాకుండా పలు విషయాలు వారికి వివరిస్తున్నారు. వేధింపులు ఎదుర్కొంటున్న బాలికలు శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు చెప్పే విధంగా భరోసా కల్పిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నగరంలో చాలా మంది బాలికలు తమను వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు చేశారు.