Wednesday, January 22, 2025

రాచకొండ పోలీసుల అదుపులో పోకిరీలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః యువతులు, మళలను వేధింపులకు గురిచేస్తున్న పోకిరీలను రాచకొండ షీటీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వేధింపులకు గురిచేస్తున్న 51మందిని అదుపులోకి తీసుకున్నారు. కొందరిపై కేసులు నమోదు చేయగా, మరికొందరికి వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. మహిళలను వెంబడిస్తూ వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరిచారు. తొలిసారి నేరం చేసి పోలీసులకు చిక్కిన వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. మళ్లీ వేధింపులకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపిస్తున్నారు.

రాచకొండ కమిషనర్ డిఎస్. చౌహాన్ ఆదేశాలతో రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలను , యువతులను వేదింపులకు గురిచేస్తున్న 51 మందిని (మేజర్స్-15, మైనర్స్ -36) షీ టీమ్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారికి ఎల్‌బి నగర్ లోని సిపి క్యాంప్ ఆఫీస్‌లో కుటుంబ సబ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. జూలైలో 127 ఫిర్యాదులు వచ్చాయని విమెన్ సేఫ్టీ వింగ్ రాచకొండ టి. ఉషారాణి తెలిపారు. ఫిర్యాదుల పై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. ఫోన్ల ద్వారా వేధించినవి -25 , వాట్సాప్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా వేధించినవి -30, సోషల్ మీడియా యాప్స్ ద్వారా వేధించినవి- 20, నేరుగా వచ్చి ఫిర్యాదు చేసినవి 24, వివిధ మార్గాల్లో వేధించినవి -28, వీటిలో 18మందిపై కేసులు నమోదు చేయగా, -15మందిపై పెట్టికేసులు, 94మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

గృహిణిని వేధిస్తున్న ఆటో డ్రైవరు
హయత్ నగర్‌కు చెందిన మహిళ రోజు పనికోసం ఆటోలో వనస్థలిపురం వెళ్లింది. తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఆటో డ్రైవర్‌కు ఫోన్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసింది. దీంతో మహిళ ఫోన్ నంబర్ తీసుకున్న ఆటో డ్రైవర్ హన్మనాయక్ ఫోన్ చేయడం ప్రారంభించాడు. తరచుగా ఫోన్ చేసి తాను చెప్పినట్లు వినాలని, తన కోరిక తీర్చాలని వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ రోజు మద్యం తాగి మహిళ ఇంటికి అర్ధరాత్రి వెళ్లాడు. నీ ఇంటి ముందు ఉన్నానని, డోర్ తీయాలని లేకపోతే పగలగొడుతానని బెదిరించాడు. అయినా కూడా బాధితురాలు డోర్ తీయకపోవడంతో కిటికీ అద్దాలు పగలగొట్టాడు. దీంతో బాధితురాలు షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది, వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి హయత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పాఠశాల విద్యార్థులకు వేధింపులు
సైకిల్‌పై వస్తున్న పాఠశాల విద్యార్థులను వేధిస్తున్న వారిని షీటీమ్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
చిన్నకొండూర్ గ్రామంలోని జెడ్‌పిహెచ్‌ఎస్ స్కూల్‌లో షీ టీమ్ బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఐదుగురు విద్యార్థులు షీటీమ్స్‌ను సంప్రదించి పాఠశాలకు వస్తుండగా తమను వేధిస్తున్న వారి గురించి ఫిర్యాదు చేశారు. బాలికలు ప్రతి రోజు గ్రామం నుండి సైకిల్‌పై వస్తుంటారు, మార్గమధ్యలో ఇద్దరు పోకిరీలు నంబర్ లేని బైక్‌పై వచ్చి వేధిస్తున్నారు. బాలికల ఫిర్యాదు మేరకు వెంటనే షీ టీమ్ చౌటుప్పల్ ఆ ప్రాంతంలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి పోకిరిలను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పర్చారు.

ప్రేమ పేరుతో సహోద్యోగినికి వేధింపులు….
హయత్ నగర్‌కు చెందిన యువతి అదే ఏరియాలో ఉన్న కెమికల్ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నది. ఆమె తోపాటు పని చేసే సహోద్యోగి గత కొంత కాలం నుంచి యుతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తన వెంటపడవద్దని ఎన్నిసార్లు చెప్పిన వినకుండా వేధించేవాడు. తనను ప్రేమించాలని, లేకపోతే ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్లో పెడతానని బెదిరించేవాడు. దీంతో బాధితురాలు షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయగా హయత్ నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

డెకాయ్ ఆపరేషన్
షీటీమ్ పనామా, మీర్‌పేట, వనస్థలిపురం ఏరియాలో రోడ్డుపై వెళ్తున్న మహిళలు, ఆడపిల్లలను వేధిస్తున్న 25 మందిని పోకిరీలను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళలు, యువతులకు ఎదురయ్యే భౌతిక పరమైన దాడులు, లైంగిక వేధింపులు, ప్రయాణ సమయాల్లో వేధింపులు వంటి ఇబ్బందుల నుంచి రక్షించేందుకు రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటున్నారని పోలీసులు పేర్కొన్నారు. మహిళలు, యువతుల పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని, పలు రకాల అవసరాలతో ఇంటి నుంచి బయటకు వచ్చే స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదన్నారు. మహిళలు వేధింపులు ఎదుర్కొంటే షీటీమ్స్ రాచకొండ వాట్సాప్ నంబర్ 8712662111లో ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో విమెన్ సేఫ్టీ వింగ్ డిసిపి టి. ఉషా రాణి , షీ టీమ్స్ ACP నరేందర్ గౌడ్, అడ్మిన్ ఎస్‌ఐ రాజు, షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News