కేంద్ర బృందం ప్రశంసలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతం అని కేంద్ర ప్రభుత్వ అధికారుల బృదం రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశంసించింది. సోమవారం ఢిల్లీనుంచి జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు చెందిన సుధీర్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్, భూపేందర్ సింగ్, తెహేదూర్ రహ్మాన్, దూబాసి, శ్రీనివాసులుతో కూడిన అధికార బృదం పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సమావేశమయింది. ఈ సందర్బంగా మంత్రి తలసాని రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖ ద్వారా జరుగుతున్న సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర బృందానికి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా సాధించిన ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఆర్ధికంగా , సామాజికంగా అభివృద్ధి సాధించాలన్నదే సిఎం కెసిఆర్ లక్షం అని తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రం 1.92కోట్ల గొర్రెల సంఖ్యతో దేశంలోనే అగ్ర స్థానంలో నిలించిందన్నారు. గొర్రెల సంపద వృద్ధిచెందటం ద్వారా 1.22లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి జరిగిందన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీకి 6,125కోట్లు వ్యయం చేస్తున్నామన్నారు. అర్హతగల గొల్ల కురుమలకు 3.5లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్లతో గొర్రెల మార్కెట్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. కేంద్రబృందం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు , పశుసంవర్ధక శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు.