Monday, January 20, 2025

పదవీ కాలానికి ముందే పాక్ పార్లమెంట్ రద్దు

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోపే పార్లమెంట్‌ను రద్దు చేయనున్నట్టు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఆగస్టు 12 నాటికి తమ ప్రభుత్వ పదవీకాలం పూర్తవుతుందని, కానీ అంతకు ముందే అధికారం నుంచి దిగిపోయి, ఆపద్దర్మ ప్రభుత్వానికి పాలనా బాధ్యతలు అప్పగిస్తామని షెహబాజ్ పేర్కొన్నారని డాన్ వార్తా పత్రిక వెల్లడించింది. ఈ క్రమం లోనే నవంబరులో పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తీవ్ర ఆర్థిక ఇక్కట్లతో సతమతం అవుతోన్న పాక్‌కు ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. మిత్ర పక్షమైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత ఆసిఫ్ అలీ జర్దారీతో భేటీ అనంతరం , అధికారం నుంచి ముందుగానే వైదొలగాలని పిఎం షెహబాజ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జర్దారీ సూచనపైనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

దీంతో నవంబర్ లో ఎన్నికలకు వెళ్లవచ్చునని పీపీపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. స్థానిక చట్టాల ప్రకారం జాతీయ అసెంబ్లీ ఐదేళ్ల పదవీకాలం పూర్తయితే 60 రోజుల్లోగా ఎన్నికలు జరగాలి. అదే ముందస్తు రద్దయితే 90 రోజుల లోపు నిర్వహించవచ్చు. ఎన్నికలకు వెనకడుగు వేస్తోన్న షెహబాజ్ ప్రభుత్వం మరింత ఆలస్యం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు తన సోదరుడు, పాక్‌కు మూడుసార్లు ప్రధానిగా చేసిన నవాజ్ షరీఫ్ వచ్చే ఎన్నికల్లో బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని షెహబాజ్ తెలిపారు. అవినీతి కేసుల్లో జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా పాకిస్థాన్ సుప్రీం కోర్టు 2018లో నవాజ్‌పై నిషేధం విధించింది. అయితే ప్రభుత్వం ఇటీవల పార్లమెంటేరియన్ల అనర్హత గరిష్ఠ కాలాన్ని ఐదేళ్లకు కుదించింది. దీంతో లండన్‌కు పారిపోయిన నవాజ్ పునరాగమనానికి ఇది మార్గం సుగమం చేసింది. ఇదిలా ఉండగా, 2018 ఆగస్టు 12న అధికారం లోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మధ్య లోనే కూలిపోవడంతో 2022 ఏప్రిల్‌లో షెహబాజ్ ప్రభుత్వం పాలనా పగ్గాలు స్వీకరించిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News