Monday, November 18, 2024

పాక్ ఉద్యోగులకు రెండు వీక్లీ ఆఫ్‌లు రద్దు… పనివేళల్లో మార్పులు

- Advertisement -
- Advertisement -

Shehbaz Sharif scraps 2 weekly-offs for govt offices

కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిరోజే కీలక నిర్ణయాలు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో నెలకొన్న తీవ్ర ఆర్థిక , రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షెహబాజ్ షరీఫ్ తొలిరోజు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వీక్లీ ఆఫ్‌లు రద్దు చేయడమే కాక, ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేశారు. పాక్ 23వ ప్రధానిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ ఈరోజు మంగళవారం ఉదయం 8 గంటలకే (ఉద్యోగుల కంటే ముందే ) తన కార్యాలయానికి చేరుకొని అందర్నీ ఆశ్చర్య పరిచారు. గతంలో ఇమ్రాన్ ఖాన్ హయాంలో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు ఉదయం 10 గంటలు నుంచి పనిచేసేవి. ఇప్పుడు ఉదయం 8 గంటలకే పనివేళలు మార్పు చేస్తున్నట్టు షాబాజ్ వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఒక్క ఆదివారం మాత్రమే వారాంతపు సెలవు ఉంటుందని వివరించారు. మనమంతా ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. ఒక్క క్షణం కూడా వృధా చేయవద్దని ఆయన ఉద్యోగులకు హితవు పలికారు.

నిజాయతీ, పారదర్శకత, శ్రద్ధ , కఠోర పరిశ్రమ, ఇవన్నీ ప్రాథమిక సూత్రాలుగా పనిచేయాలని షరీఫ్ ఉద్యోగులకు సూచించారు. పింఛను పెంపు, కనీస వేతనం రూ. 25 వేలు పెంపునకు సంబంధించిన ప్రకటనలు తక్షణం అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై నిపుణుల సూచనలు తెలుసుకోడానికి అత్యవసర సమావేశం ఏర్పాటు కావాలని ఆదేశించారు. మరోవైపు కేబినెట్ మార్పుకు సంబంధించిన సంప్రదింపులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీకి విదేశాంగ మంత్రిత్వశాఖ అప్పగించవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే పిఎంఎల్‌ఎన్ (పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్) పార్టీకి చెందిన రాణా సనుల్లా , ఔరంగజేబ్‌లకు అంతర్గత వ్యవహారాలు, సమాచార శాఖలను అప్పగించనున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు మూడు సార్లు ప్రధాని అయిన నవాజ్ షరీఫ్‌కు షహబాజ్ సోదరుడు అవుతారు. అత్యంత కీలకమైన పంజాబ్ ప్రావిన్స్ కు మూడుసార్లు ముఖ్యమంత్రి అయి మంచి పరిపాలనా దక్షుడుగా పేరు పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News