Monday, January 6, 2025

హసీనా ‘సర్వ నాశనం చేశారు’: ముహమ్మద్ యూనస్

- Advertisement -
- Advertisement -

షేఖ్ హసీనా ప్రభుత్వం ‘సర్వం నాశనం చేసింది’ అని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో రాజ్యాంగ, న్యాయ సంస్కరణలు తీసుకువచ్చిన తరువాతే సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని యూనస్ ప్రతిజ్ఞ చేసినట్లు ఆయన ఒక జపనీస్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూను ఉటంకిస్తూ బంగ్లాదేశ్ సంగ్‌బాద్ సంగ్‌స్థ బుధవారం వెల్లడించింది. ‘మాకు (ఎన్నికల నిర్వహణకు ముందు) ఆర్థిక వ్యవస్థ, అధికార యంత్రాంగం, న్యాయవ్యవస్థలలో సమగ్ర సంస్కరణల అవసరం ఉంది’ అని 84 ఏళ్ల నోబెల్ విజేత యూనస్ ‘నిక్కీ ఆసియా’తో ఇంటర్వూలో చెప్పారు. బంగ్లాదేశ్‌లో హసీనాపై అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ విచారణ

ముగిసిన తరువాత ఆమెను భారత్ తమకు అప్పగించాలని కూడా యూనస్ పునరుద్ఘాటించారు. ‘విచారణ ముగిసి, తీర్పు వెలువడినట్లయితే, ఆమెను మాకు అప్పగించవలసిందిగా భారత్‌కు లాంఛనంగా విజ్ఞప్తి చేస్తాం’ అని యూనస్ తెలిపారు. ఉభయ దేశాలు సంతకం చేసిన అంతర్జాతీయ చట్టం కింద ‘భారత్ దానిని పాటించవలసి ఉంటుంది’ అని ఆయన అన్నారు. హిందువుల భద్రత గురించి భారత ప్రభుత్వ ఆందోళన వాస్తవాల ఆధారంగా లేదని, అది అంతా ‘ప్రచారం’ మాత్రమేనని యూనస్ పేర్కొన్నారు. సార్క్ పునరుజ్జీవం గురించి కూడా తాను ప్రతిపాదించినట్లు, భారత్, పాకిస్తాన్ మధ్య దెబ్బతిన్న సంబంధాల కారణంగానే అది స్తంభించినట్లు యూనస్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News