న్యూఢిల్లీ : ఢిల్లీ మేయర్‌గా రెండోసారి షెల్లీ ఒబెరాయ్ ఏకగ్రీవంగా బుధవారం ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శిఖారాయ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవ ఎన్నికకు వీలైంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక నుంచి కూడా బీజేపీ తప్పుకుంది. మేయర్‌గా గెలుపొందేందుకు తగిన బలం లేకపోవడంతో ఓటమిని ముందే ఊహించి బీజేపీ పోటీ నుంచి తప్పుకుంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయం లో కూడా పోటీ నుంచి బీజేపీ వైదొలగడంతో ఆప్ అభ్యర్థి ఆలీ మహమ్మద్ ఇక్బాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక ముగియగానే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభా కార్యకలాపాలను మే 2 కు వాయిదా వేస్తున్నట్టు షెల్లీ ఒబెరాయ్ ప్రకటించారు.
Also Read: ఢిల్లీ పబ్లిక్‌స్కూల్‌కు బాంబు బెదిరింపు
గత రెండు నెలలుగా వాయిదా పడిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి గత ఫిబ్రవరి లోనే ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే . ఫిబ్రవరి 22న ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ మేయర్‌గా నాలుగో ప్రయత్నంలో గెలుపొందారు కూడా. దీనికి ముందు మూడు సమావేశాల్లో ఆప్, బీజేపీ మధ్య గందరగోళం తలెత్తింది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కుల వ్యవహారంపై గొడవ జరగడంతో మూడుసార్లు వాయిదా పడి నాలుగోసారి ఎన్నిక జరిగింది. బీజేపీకి చెందిన రేఖా ఖప్తాను షెల్లీ ఒబెరాయ్ 34 ఓట్ల తేడాతోఓడించారు. మొత్తం పోలైన 266 ఓట్లలో రేఖా గుప్తా 116 ఓట్లు సాధించారు. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం మార్చి 31తో ఎంసిడి హౌజ్ కాలపరిమితి ముగియడంతో మరోసారి తాజాగా ఎన్నికలు నిర్వహించారు.
Also Read: ఇంటర్ పాసైన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు
ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆప్ అభ్యర్థి ఒబెరాయ్ పోటీకి దిగి తక్కువ కాలం లోనే మరోసారి ఢిల్లీ మేయర్ పదవిని దక్కించుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఢిల్లీ మేయర్ ఒక సంవత్సరం పాటు పదవిలో ఉంటారు.రొటేషన్ పద్ధతిలో ఐదేళ్ల పాటు ఒక్కో ఏడాది ఒక్కొక్కరు మేయర్‌గా ఉండనున్నారు. తొలి ఏడాది మహిళలకు, మరో ఏడాది ఓపెన్ కేటగిరికి, మూడో సంవత్సరం రిజర్వ్‌డ్ కేటగిరికి, మిగిలిన రెండూ మళ్లీ ఓపెనె కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. గత ఏడాది డిసెంబర్ 4న జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ విజయం సాధించింది. దీంతోఎంసీడీలో బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెర పడింది. మొత్తం 250 వార్డులకు గాను ఆప్ 134 దక్కించుకోగా, బీజేపీకి 104 వచ్చాయి.
సిఎం కేజ్రీవాల్ అభినందనలు
మేయర్‌గా విజయం సాధించిన ఒబెరాయ్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. ప్రజలకు ఆప్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయని, వారి అంచనాలను నెరవేర్చడానికి కష్టపడి పని చేద్దామని ఒబెరాయ్‌ను ఉద్దేశించి కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
Also Read: మళయాళ నటుడు మముక్కోయ ఆకస్మిక మృతి