Monday, December 23, 2024

రోహింగ్యాలపై రాద్ధాంతం!

- Advertisement -
- Advertisement -

Shift Rohingyas to EWS flats ఉన్నట్టుండి రోహింగ్యాల సమస్య మరోసారి భగ్గుమంది. ఢిల్లీలో తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకొంటున్న ఈ శరణార్ధులను మౌలిక సౌకర్యాలుండే బలహీన వర్గాల (ఇడబ్ల్యుఎస్) అపార్టుమెంట్లలోకి మార్చాలన్న నిర్ణయానికి హిందుత్వ ఉన్మత్త శక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దానితో కేంద్రం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొంది. ఇదంతా బుధవారం ఒక్క రోజులోనే జరిగిపోయింది. రోహింగ్యాలను ఢిల్లీ బక్కర్వాలా ప్రాంతంలోని మౌలిక సౌకర్యాలు న్న బలహీన వర్గాల ఫ్లాట్లలోకి తరలించి వారికి భద్రత కలిగించాలని నిర్ణయించినట్టు కేంద్ర గృహ వసతి, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పురి బుధవారం ఉదయం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తీసుకొన్నందుకు హర్షం వ్యక్తం చేశారు. అది తమ ప్రభుత్వ ఘనకార్యం గా చెప్పుకొన్నారు. ఆ వెంటనే దీనికి కరడుగట్టిన హిందుత్వశక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రోహింగ్యాలు దేశంలోకి అక్రమంగా చొచ్చుకు వచ్చినవారని, వారు శరణార్థులు కారని, వెంటనే దేశం నుంచి వెనక్కు పంపించేయాలనీ విశ్వహిందూ పరిషత్ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. వారిని దేశంలో కొనసాగనివ్వబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో చేసిన ప్రకటనను గుర్తుకు తెచ్చింది.

రోహింగ్యాల గుడిసెలను తగులబెట్టిన వారిని దేశభక్తులుగా, హీరోలుగా కీర్తించిన చరిత్ర హిందుత్వ శక్తులకున్నది. వారి నుంచి వ్యతిరేకత దూసుకురావడంతో బుధవారం సాయంత్రానికి కేంద్రం మనసు మార్చుకొన్నది. హర్దీప్ సింగ్ పురి తెరమరుగై అమిత్ షా శాఖ ముందు కొచ్చింది. రోహింగ్యాలను శాశ్వత నివాసాల్లోకి తరలించే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ బుధవారం మధ్యాహ్నం స్పష్టం చేసింది. వారిని ఉన్న చోటనే కొనసాగనివ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. శరణు కోరినవారిని ఇండియా ఎల్లవేళలా స్వాగతిస్తుందంటూ హౌసింగ్ మంత్రి బుధవారం ఉదయం చేసిన ప్రకటన దీనితో గాలి తీసిన బంతి అయిపోయింది. విచిత్రమేమంటే ఓట్ల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేస్తున్న రాజకీయమే ఇదంతా అని ఆప్ మీద బిజెపి విరుచుకుపడింది. బిజెపియే వోట్ల రాజకీయం ఆడుతున్నదని, కావాలంటే తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రోహింగ్యాలకు ఇళ్ళు ఇచ్చుకోవాలి గాని ఢిల్లీలో వారికి స్థిర నివాసం కల్పించడం సబబు కాదని ఆప్ ఎదురుదాడికి దిగింది. గత ఏడాది జూన్‌లో ఢిల్లీ కాంచన్ కుంజ్‌లోని రోహింగ్యాల శిబిరంలో జరిగిన అగ్నిప్రమాదంలో వారి గుడిసెలు 50 తగలబడ్డాయి. ఆ తర్వాత వారిని అద్దె ఇళ్లకయినా తరలించాలని పలు స్వచ్ఛంద సంస్థలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి.

పర్యవసానంగా ఢిల్లీ పోలీసులు, లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో కొంత మథనం జరిగి బక్కర్ వాలా అపార్ట్‌మెంట్‌లు అందుకు అనుకూలమైనవనే నిర్ధారణకు వచ్చినట్టు బోధపడుతున్నది. శరణార్థులైనా, చొరబాటుదారులైనా ఎవరైనా రోహింగ్యాలు స్వదేశం మయన్మార్‌లో అక్కడి మెజారిటీ వర్గం దాడులకు తట్టుకోలేక పారిపోయి వచ్చినవారే. దేశంలో గల ప్రతి ఒక్కరి జీవన హక్కును గౌరవించాలని మన రాజ్యాంగం చెబుతున్నది. వీరిని స్వదేశానికి పంపించడం సంగతి ఎలా ఉన్నా ఇక్కడ ఉన్నంత కాలం మౌలిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఢిల్లీలో 50 కుటుంబాల రోహింగ్యాలున్నారు. 250 మంది ఉంటారు. ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్ వద్ద నిరసనల్లో పాల్గోడానికి వచ్చి స్థిరపడ్డారని సమాచారం. 2017లో మయన్మార్‌లో మెజారిటీ వర్గం దాడుల వల్ల లక్షలాది మంది రోహింగ్యాలు కట్టుబట్టలతో వచ్చి వేర్వేరు దేశాల్లో తలదాచుకొంటున్నారు. వీరు ప్రాణార్తులు, అన్నార్తులు కావాలే గాని, ప్రమాదకారులయ్యే అవకాశాలు తక్కువ. బంగ్లాదేశ్‌లో లక్షలాది మంది తలదాచుకొంటున్నారు. మన దేశంలో ఉన్నవారు నలభై వేల మందని సమాచారం. అంతర్జాతీయ న్యాయం ప్రకారం వీరిని శరణార్థులుగా పరిగణించాలి.

నిరాశ్రయులకు ఆశ్రయమివ్వాలన్న మంచి నిర్ణయం మతోన్మాదుల కారణంగా వెనక్కిపోవడం ఆందోళనకరణం. మిగతా ప్రపంచమంతా మయన్మార్‌లో రోహింగ్యాలపై జరిగిన ఊచకోత హత్యకాండను మానవ మారణహోమంగా గుర్తించింది. మానవాళిపై జరిగిన దాడిగా పరిగణిస్తూ తీర్మానాన్ని బ్రిటన్ ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రోహింగ్యాలు ముస్లింలు కావడం వల్లనే వారిని కేంద్రంలోని బిజెపి చొరబాటుదారులుగా చూస్తున్నదని భావించాలి. వారిని మయన్మార్ హింసించి, వేధించి విడతలు విడతలుగా బహిష్కరిస్తున్నది. వారికి జాతీయతను నిరాకరించింది. దేశం, పౌరసత్వం లేని అనాథలైన వీరిని మానవతా దృష్టితో చూడాలని అంతర్జాతీయ చట్టాలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి శరణార్థుల ప్రకటన మీద సంతకం చేయని దేశాలు సైతం ఇటువంటి వారిని ఆదుకోవలసిన బాధ్యతను గుర్తించాలి. టిబెటన్లు, చక్మాలు, శ్రీలంక తమిళులు వంటి వారిని శరణార్థులుగా పరిగణించి ఆదరిస్తున్న భారత దేశం రోహింగ్యాలను తిరస్కరించడంలో ఔచిత్యం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News