న్యూస్‌డెస్క్: ఉద్యోగుల నుంచి ఎక్కువ పని రాబట్టుకోవాలని సాధారణంగా ఏ సంస్థ యాజమాన్యాలైనా భావిస్తుంటాయి. అలాగే..పని ఒత్తిడి ఎక్కువైపోయిందంటూ ఉద్యోగులు కూడా వాపోతుంటారు. అయితే..మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఐటి కంపెనీ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తోంది. ఆ సంస్థ యాజమాన్యానికి పుట్టిన కొత్త ఆలోచన ఉద్యోగుల్లో నూతనోత్సాహానికి దారితీస్తోంది. ఇక తమకు వీకెండ్ పార్టీలు కాని..ఓవర్‌టైమ్ వర్కింగ్ అవర్స్ కాని, మండే మోటివేషన్ క్లాసెస్ కాని అవసరం లేదని ఉద్యోగులు సంతోషపడుతున్నారు. ఉద్యోగుల షిఫ్ట్ టైమ్ ముగియడానికి 10 నిమిషాల ముందు వారి డెస్క్‌టాప్ స్క్రీన్‌పైన ఒక మెసేజ్ ఎలా ప్రత్యక్షమవుతుందో వివరిస్తూ ఆ కంపెనీ హెచ్‌ఆర్ స్పెషలిస్ట్ తన్వీ ఖండేల్వాల్ ఒక లింక్డ్‌ఇన్ పోస్టు షేర్ చేశారు.
వార్నింగ్!! మీ షిఫ్ట్ టైమ్ అయిపోయింది. మరో 10 నిమిషాల్లో మీ ఆఫీస్ సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది. దయచేసి ఇళ్లకు వెళ్లండి అంటూ ఇంగ్లీష్‌లో మెసేజ్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
గత కొద్దిరోజులుగా ఈ పోస్టు వైరల్ అవుతోంది. చాలామంది దీన్ని బోగస్‌గా భావించారు. అయితే కంపెనీ హెచ్‌ఆర్ మాత్రం ఇది వాస్తవమేనంటూ నిర్ధారించారు. ఇది పబ్లిసిటీ కోసం కాని ఊహాజనితమైనది కాని కాదని, ఇది తమ కార్యాలయం సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్స్ ఉద్యోగుల కోసం తమ యాజమాన్యం చేసిన వినూత్న ఆలోచనని ఆమె వెల్లడించారు. షిఫ్ట్ టైమ్ అయిపోవడానికి 10 నిమిషాల ముందు ప్రత్యక్షమయ్యే ఈ స్పెషల్ రిమైండర్ వల్ల ఉద్యోగి ఓవర్‌టైమ్ పనిచేయాల్సిన అవసరం ఉండదని, బిజినెస్ అవర్స్ తర్వాత కాల్స్ కాని, మెయిల్స్ కాని అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. ఇది అద్భుత ఆలోచన కదా అంటూ ఆమె రాసుకొచ్చారు.