మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త సచివాలయ భవనంలోకి శాఖల తరలింపు రేపటి నుంచి (మంగళవారం) ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కేటాయింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ప్రారంభోత్సవం నుంచే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు జరగాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. అయితే సోమవారంలోపు నెట్‌వర్కింగ్, ఫర్నీచర్ పనులను పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా ముమ్మర చర్యలు చేపట్టారు. శనివారం రంజాన్ కావడం, ఆదివారం సెలవుదినం కావడంతో ఈ రెండు రోజులు పనులు సాధ్యపడలేదు. అయితే సోమవారం నెట్‌వర్కింగ్, ఫర్నీచర్ పనులను పూర్తి చేసి మంగళవారం నుంచి అన్ని విభాగాలకు చెందిన ఫైళ్లను నూతన సెక్రటేరియట్ భవనంలోకి తరలిస్తామని జిఏడి అధికారులు తెలిపారు.
ఇరిగేషన్ శాఖ ఐదో ఫ్లోర్‌లో
ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బందిని బట్టి ఆయా ఫ్లోర్‌లను జీఏడి కేటాయిస్తోంది. ప్రభుత్వ ఫ్రొటోకాల్, సెక్రటేరియట్ ఉద్యోగుల వ్యవహారాలను జీఏడీ పర్యవేక్షిస్తుంది. దీంతో ఆయా శాఖలను ఫస్ట్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేయాలని కెసిఆర్ ఆదేశించినట్లుగా తెలిసింది. ఎక్కువ ఉద్యోగులు ఉన్న ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ సెకండ్ ఫ్లోర్‌లో, రెవెన్యూ శాఖను థర్డ్ ఫ్లోర్‌లో, పంచాయతీరాజ్ శాఖకు ఫోర్త్ ఫ్లోర్‌లో, ఇరిగేషన్ శాఖ ఐదో ఫ్లోర్‌లో మిగతా శాఖలను వివిధ ఫ్లోర్లలో ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిసింది.
ఫిజికల్ ఫైల్స్ తరలింపు నేటి నుంచి
ప్రతి శాఖకు సంబంధించిన ఫైళ్లతో పాటు, కొత్త కంప్యూటర్లను ఏర్పాటు చేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం బిఆర్‌ఆర్‌కె భవన్‌లో ఉన్న కంప్యూటర్ల నుంచి సంబంధిత శాఖల వివరాలను పెన్‌డ్రైవ్‌లో తెచ్చుకోవాలని ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులకు జీఏడికి సూచించినట్లు తెలిసింది. ఫిజికల్ ఫైల్స్ మాత్రం మంగళవారం నుంచి నూతన సెక్రటేరియట్ భవన్‌లోకి అధికారులు తరలించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఆరో అంతస్తులో సిఎం కార్యాలయం
ఆరో అంతస్తులో సిఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సచివాలయ భవనంలోని అన్ని అంతస్థుల్లో ఫర్నీచర్ ఏర్పాటు పనులు పూర్తి కావస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు కొన్ని అంతస్థుల్లో ఫర్నీచర్ ఏర్పాటు పనులన్నీ ఇప్పటికే పూర్తి కాగా, మిగతా చోట్ల పనులు జరుగుతున్నాయి. రెండు రోజుల్లో ఫర్నీచర్, నెట్ వర్కింగ్ సంబంధిత పనులన్నీ పూర్తికానున్నట్టు జీఏడి అధికారులు తెలిపారు. అటు సచివాలయ భవనంలో కేటాయింపు ప్రక్రియ దాదాపుగా పూర్తి కాగా, మంత్రుల వారీగా చాంబర్‌ల కేటాయింపు పూర్తయినట్టుగా సమాచారం.
16 మంది మంత్రుల చాంబర్‌లు ఒకటి నుంచి ఐదు అంతస్థుల్లోకి…
16 మంది మంత్రులకు ఒకటి నుంచి ఐదు అంతస్తుల్లోని ఛాంబర్‌లలో కేటాయించారు. మంత్రులకు అనుగుణంగా ఆయా శాఖలకు సంబంధించిన కార్యదర్శుల కేటాయింపు కసరత్తు కూడా దాదాపుగా పూర్తయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ పనులకు సంబంధించి పూర్తి కసరత్తు చేశారు. కార్యదర్శులు, అధికారులు, ఆయా విభాగాలకు సంబంధించి కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసినట్లుగా సమాచారం. కొందరు మంత్రులకు ఒక్కటికి మించి ఎక్కువ శాఖలు ఉండడంతో సదరు మంత్రికి సంబంధించిన కార్యదర్శులు అందరూ ఒకే చోట ఉండేలా కేటాయింపులు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసి సోమవారం సాయంత్రంలోగా వాటికి సంబంధించిన ఆదేశాలు జీఏడి అధికారులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.