దుబాయ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అయితే ఈ టోర్నమెంట్‌లో భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటు లేకపోవడం జట్టుకు తీరని లోటే అని శిఖర్ ధవన్ అభిప్రాయపడ్డారు. గాయం కారణంగా బుమ్రా ఈ టోర్నమెంట్‌కి దూరమైన విషయం తెలిసిందే. అయితే బుమ్రా జట్టులో లేకపోయినా.. భారత్ జట్టు పటిష్టంగానే ఉందని.. ఈసారి ఫేవరేట్ అని ధవన్ పేర్కొన్నారు.
‘బుమ్రా లేని లోటును భర్తీ చేయడం కష్టం. నా దృష్టిలో అతను ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా.. ప్రశాంతంగా ఉండే వ్యక్తి. ఐసీసీ టోర్నమెంట్‌లో అలా ఉండటం చాలా అవసరం. కానీ, ఇటీవలి ఫామ్ ప్రకారం ఈ టోర్నమెంట్‌లో భారత్‌యే ఫేవరేట్. ఓ వైపు అనుభవం కలిగిన ఆటగాళ్లు, మరోవైపు యువకులతో జట్టు పటిష్టంగా ఉంది. శుభ్‌మాన్ గిల్ రాణిస్తుండగా.. రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఏలాగూ విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు. కాబట్టి ఈ టోర్మమెంట్ టైటిల్‌ని అందుకొనే సత్తా భారత్‌కి ఉంది’ అని ధవన్ అన్నారు.