రేపు చంచల్గూడా జైలు నుంచి విడుదల
హైదరాబాద్: అధికవడ్డీలు, పెట్టుబడుల పేరిట ప్రముఖులను మోసం చేసిన అన్ని కేసులలో శిల్పాచౌదరికి గురువారం నాడు షరతులతో కూడిన బెయిల్‌ను రాజేందర్‌నగర్ కోర్టు మంజూరు చేసింది. దివ్యారెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేసిన కేసులో శిల్ప చౌదరికి ఇదివరకే ఉప్పర్ పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయగా మిగిలిన రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. ఆమెపై నమోదైన మూడు కేసుల్లోనూ బెయిల్ రావడంతో శుక్రవారం నాడు చంచల్‌గూడ జైలు నుంచి ఆమె విడుదల కానున్నారు. నగరంలో పలువురిని రూ. కోట్లలో మోసగించిన ఘరానా కిలేడీ శిల్పాచౌదరిని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
గండిపేటలోని సిగ్నేచర్ విల్లాస్‌లో నివసిస్తున్న శిల్పాచౌదరి, కృష్ణ శ్రీనివాస ప్రసాద్ దంపతులు తరచూ కిట్టీపార్టీలు నిర్వహిస్తూ టాలీవుడ్ పెద్దలతో దిగిన ఫొటోలను చూపిస్తూ సంపన్న కుటుంబాల మహిళలను ఆకట్టుకుని సినిమా నిర్మాణంలో, రియల్ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలు భారీగా వస్తాయని నమ్మబలుకుతూ పలువురి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. శిల్పాచౌదరి తనను తాను సినీ నిర్మాతగా తన భర్తను రియల్టర్‌గా చెప్పుకుంటూ భారీ ఎత్తున నగదు వసూళ్లకు పాల్పడ్డారు.ప్రముఖుల నుంచి రూ.7 కోట్ల మేర మోసం చేసిందని శిల్పపై ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేయడంతో ఆమెపై మూడు కేసులు నమోదు చేశారు. ఈక్రమంలో ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించేందుకు శిల్పాచౌదరిని మూడు పర్యాయాలు పోలీసులు కస్టడీలోకి తీసుకుని అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించారనే విషయంపై పోలీసులు విచారణ జరిపి కోర్టుకు సమర్పించారు.