నిధుల తరలింపుపై పెదవి విప్పని వైనం
రెండో రోజు ముగిసిన కస్టడి
హైదరాబాద్: అధిక వడ్డీల పేరిట వసూళ్లకు పాల్పడిన శిల్పాచౌదరి కేసులో ఆ డబ్బును ఎక్కడికి తరలించారు, కొనుగోలు చేసిన స్థిరచరాస్థుల వెనుక మీ బినామీలు ఎవరన్న కోణంలో పోలీసులు సంధించిన ప్రశ్నలకు ఆమె నుంచి ఏలాంటి సమాధానం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ కేసులో లోతుగా ప్రశ్నించేందుకు శిల్పాచౌదరిని రెండవ రోజు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రెండవ రోజు దర్యాప్తులో భాగంగా శిల్పా చౌదరిని శనివారం ఉదయం చంచల్‌గూడ జైలునుంచి నార్సింగిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం ఎస్‌వొటి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నగదు తరలింపు అంశంపై ఆమెను ప్రశ్నించడంతో నిజాలను వెల్లడించేందుకు నిరాకరిస్తుందని పోలీసులు పేర్కొన్నారు. గత రెండు రోజులుగా పలువురికి అధిక వడ్డీల పేరిట ఆశ చూపి దండుకున్న కోట్ల రూపాయలను ఎక్కడకు మళ్లించారనే అంశంపై లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.
మొత్తం ఎంతమంది నుంచి డబ్బు వసూలు చేసింది, తీసుకున్న సొమ్మును ఏం చేశారనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా గండిపేట్ సిగ్నేచర్ విల్లాస్‌లో ఉంటున్న శిల్ప దంపతులు స్థిరాస్తి, అధిక వడ్డీలు అంటూ పలువురిని బురిడీ కొట్టించి కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. గత నెలలో వీరిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసి రిమాంద్‌కు తరలించారు. మోసాలకు సంబంధించిన వివరాలు రాబట్టేందుకు ఇటీవల శిల్పను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు… ఆమె నుంచి సరైన సమాచారం సేకరించలేకపోయారన్నది సమాచారం. ఈనేపథ్యంలో పోలీసుల విచారణలో చెప్పిన సమాధానాలనే శిల్ప మళ్లీ చెబుతున్నట్టు సమాచారం. కిట్టీపార్టీల్లో పరిచయమైన వారి నుంచి తీసుకున్న కోట్ల రూపాయలను పెట్టుబడులుగా మలిచేందుకు కొందరు వ్యాపారులకు ఇచ్చినట్టు చెబుతున్నట్టు తెలుస్తోంది. పొంతనలేని సమాధానాలు విచారణలో చెబుతున్నట్టు సమాచారం. ఆమె డబ్బులు ఇచ్చినట్టు చెప్తున్న వారు సైతం తామూ బాధితులమే అంటున్నారు. దీంతో కేసు గందరగోళంగా మారింది.
మొత్తంగా నిందితురాలు శిల్ప పలువురిని మోసం చేసి వసూలు చేసిన కోట్ల రూపాయలు ఎక్కడకు మళ్లించిందనే అంశంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.ఇందులో భాగంగా శిల్ప ఇంట్లో నుంచి పోలీసులు ఇప్పటికే పలు పత్రాలు, బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకున్నారు. శిల్పా చౌదరి వసూలు డబ్బులను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు కొంతమందికి ఇచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులకు తెలిపారు. శిల్ప చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు పలువురికి నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆమె వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల పాటు శిల్పను ప్రశ్నించి ఆమె వద్ద నుంచి పలు వివరాలు సేకరించేందుకు నార్సింగి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా రియాల్టర్ రాధికారెడ్డికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చానని శిల్పాచౌదరి పేర్కొనడంతో ఆమెను విచారించేందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో శిల్పా చౌదరి విచారణలో పేర్కొన్న పలువురికి నోటీసులు ఇవ్వడంతో పాటు విచారణ చేపడుతున్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు.