Sunday, December 22, 2024

ఐటి కారిడార్ లో రయ్ రయ్

- Advertisement -
- Advertisement -

అందుబాటులోకి శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్
నేడు ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
నిర్మాణం మొదటి దశ ఖర్చు మొత్తం రూ.466 కోట్లు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరవాసులకు మరో ప్రధాన ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఎస్‌ఆర్‌డిపి ద్వారా చేపట్టిన శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నేడు (శుక్రవారం) మునిసిపల్ పట్టణాభివృద్ధి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు.

రాష్ట్ర అవిర్భావం తర్వాత గ్రేటర్‌లో అందుబాటులోకి 17వ ఫ్లై ఓవర్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నగరవాసులకు 17వ ఫ్లై ఓవర్ బ్రిడ్జి (శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్) అందుబాటులోకి రానుంది. నగరం రోజురోజుకు విస్తరిస్తుండడం, అందుకు తగ్గట్టుగా పెరుగుతున్న వాహనాల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జిహెచ్‌ఎంసి విశేష కృషి చేస్తోంది. అంతేకాకుండా మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.ఆర్ ముందుచూపుతో గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వ నగరంగా అభివృద్ధి చేసి మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఆర్‌ఓబిలు, ఆర్‌యుబిలతోపాటు పెద్ద ఎత్తున జంక్షన్ల అభివృద్ధి జరిగాయి.

తద్వరా రవాణా సౌకర్యం పెరగడం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, ఫ్రీ సిగ్నల్ రవాణా వ్యవస్థను మెరుగు పడడంతో ప్రయాణ సమయంతో పాటు ఇంధనం, వాహనాల నిర్వహణ ఖర్చు కూడా గణనీయంగా తగ్గింది. ఐటీ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్‌లో గచ్చిబౌలి, మాదాపూర్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో గణనీయమైన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత రవాణా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఏర్పడడంతో ఎస్‌ఆర్‌డి.పి ద్వారా కారిడార్లు, గ్రేడ్ సెపరేట్, అండర్ పాస్‌లు. ఆర్‌ఓబిలు లాంటి రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు దోహద పడుతున్నాయి. ఇందులోభాగంగానే శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఔటర్ రింగు రోడ్డు ద్వారా గచ్చిబౌలి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా నేరుగా చేరుకున్నప్పటికీ అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సులభతరంగా వెళ్లేందుకు ముఖ్యంగా శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వెళ్లేందుకు సులభతరం అవుతుంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి మీదుగా పఠాన్ చేరు, కోకాపేట్, నార్సింగ్‌తో పాటుగా అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లేందుకు సులభతరం అవుతుంది.

శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ విశేషాలు…

శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ నిర్మాణం మొదటి దశ ఖర్చు మొత్తం రూ.466 కోట్లు. ఇందులో ఫ్లై ఓవర్ నిర్మాణం ఖర్చు రూ.257 కోట్లు కాగా, భూసేకరణలో భాగంగారూ. 43 కోట్లు నగదుతోపాటు రూ.166 కోట్లు విలువైన టిడిఆర్ జారీ అయ్యాయి. ఓఆర్‌ఆర్ నుంచి గతంలో ఉన్న గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై నుంచి శిల్పా లేఔట్ వరకు అక్కడ నుంచి ఓఆర్‌ఆర్ వరకు మరో వైపు రెండు వైపులా కలుపుకుని మొత్తం 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పు గల ఫ్లై ఓవర్‌ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. అప్ ర్యాంపు ఓఆర్‌ఆర్ నుండి శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ వరకు 456.64 మీటర్ల వెడల్పు, శిల్పా లే అవుట్ నుంచి ఓ.ఆర్‌ఆర్ వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 399.952 మీటర్ల వెడల్పుతో రెండు ఫ్లైఓవర్‌లను చేపట్టారు. సర్వీస్ రోడ్డుగా ఉపయోగించుకునేందుకు గచ్చిబౌలి నుంచి మైండ్ స్పేస్ వరకు 473 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో అప్ ర్యాంపు ఫ్లైఓవర్ ను చేపట్టారు. అదే విధంగా మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 522 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో చేపట్టారు. ఈ శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ వల్ల ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, హై టెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్‌కు సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. హెచ్.కె.సి, మీనాక్షి టవర్ ప్రాంతంలో అభివృద్ధి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు రెండవ దశలో భాగంగా ఓఆ.ఆర్ నుంచి కొండాపూర్ వరకు చేపట్టే ఫ్లై ఓవర్ పనులు కొనసాగుతున్నాయి.

17వ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తోంది : మంత్రి కెటిఆర్

నగరవాసులకు మరో ఫ్లై ఓవర్ అం దుబాటులోకి రాబోతోందని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ గురువా రం ట్వీట్ చేశారు. గచ్చి బౌలి జం క్షన్ వద్ద శుక్రవారం శిల్పా లేఅవుట్ ప్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. గడచిన 6 ఏళ్ల కాలంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డిపి) ద్వారా 17వ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తి అయ్యిందన్నారు. ప్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రావడం ద్వారా మరింత సులభతరమైన ప్రయాణం నగరవాసులకు అందుబాటులోకి రానుందంటూ ట్విటర్ వేదికగా ఫ్లై ఓవర్ ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ కాగా ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుండటంతో ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News