ముంబై: అశ్లీల విడియోలు తీసి అప్ లోడ్ చేశానన్న నేరారోపణలో తాను బలిపశువునయ్యానని సినీ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా వాపోయారు. ఏ ఒక్క మహిళా తనకు వ్యతిరేకంగా చెప్పలేదన్నారు. దర్యాప్తు సంస్థ కూడా ఏ ఒక్క ఆధారాన్ని సాక్ష్యాలతో నిరూపించలేకపోయిందని అన్నారు. తనపై మోపిన కేసును కొట్టివేయాలంటూ ఆయన మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. తన న్యాయవాది ప్రశాంత్ పాటిల్ ద్వారా ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
అభియోగపత్రంలో కానీ, సప్లిమెంటరీ చార్జ్ షీటులోకానీ ఏ ఒక్క మహిళ కూడా తనను కుంద్రా బెదిరించినట్టు, బలవంతం పెట్టినట్టు, వీడియో తీసినట్టు చెప్పలేదని పేర్కొన్నారు. పోర్న్ కంటెంట్ అప్ లోడ్ లేదా విక్రయంలో పాల్గొనలేదని నివేదించారు. కాగా రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ మెటీరియల్ పంపిణీ కోసం ‘హాట్ షాట్స్’ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసినట్టు పోలీసులు తమ చార్జ్ షీటులో పేర్కొన్నారు. దీన్ని రాజ్ కుంద్రా ఖండించారు. దర్యాప్తు సంస్థ తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా సంపాదించలేదన్నారు.