వైరస్ వేళ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కవితాత్మకత
ముంబై : నమ్మకం, అంతకుమించిన ఆత్మస్థయిర్యం వీటిని అలవర్చుకో, కనులముందున్న కలవరపెడుతున్న కరోనాను దరిచేరనివ్వకు అని బాలీవుడ్ అందాల నటి శిల్పాశెట్టి కుంద్రా దేశ ప్రజలకు పిలుపు నిచ్చారు. మనిషికి ఇప్పుడు వైరస్ కాటు తరువాత ఏర్పడే శారీరక విషమస్థితి కన్నా ముందు ఇది వస్తుందనే భయంతో ఏర్పడే మానసిక కల్లోల స్థితి ప్రమాదకరం అయిందని శిల్పా అభిప్రాయపడి, జనంలో మానసిక చైతన్యం కోసం స్ఫూర్తిదాయక కవితను రూపొందించారు. ఇప్పటి అవసరం నమ్మిక, ఇది చీకటిని చీల్చే వేయి రేకుల ఆశాకిరణం అవుతుందని తెలిపారు. ఏదో ముంచుకువస్తుంది, ప్రాణాలను తోడేస్తుందనే అభద్రతా భావం వీడండి, అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొండని కోరారు. నీలోని నిన్ను గుర్తుంచుకుంటే, దీనికే ప్రాధాన్యత ఇస్తూ పోతే ఏ ఇతర చేటు చేసే శక్తి మనను ఏమీ చేయలేదని పేర్కొంటూ శిల్పాశెట్టి ఓ కొండపై ప్రకృతి పచ్చదనాల నీడలో ధ్యానంలో ఉన్నప్పటి ఫోటోతో కూడిన కవితను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పొందుపర్చారు.
అతిగా ఆలోచించకు, అంతర్లీన శక్తిని వంచించకు అని ఉద్భోధించారు. ఏ అంశంపై అయినా సుదీర్ఘ స్థాయిలో ఆలోచిస్తూ పోతూ ఉంటే అది చివరికి మనను మన సంతోషాన్ని దెబ్బతీస్తుందని కరోనా భయాలను దృష్టిలో పెట్టుకుని చెప్పారు. సంతోషం సగం బలం, దీనిని దెబ్బతీసే ఎటువంటి పరిణామం అయినా పూర్తిస్థాయిలో మనిషిని దెబ్బతీస్తుంది. ధాన్యంతో కూర్చుని ఎటువంటి వారైనా సుదీర్ఘ శ్వాస తీసుకుని, తరువాత నిశ్వాసానాకి దిగండి, ఈ లయబద్ధమైన ఉచ్ఛాస నిశ్వాసాల నడుమ ఎట్టి పరిస్థితుల్లోనూ మీమీద మీ నమ్మకం సడలిపోనివ్వకండి తరువాత మీరు పొందే ఆనందానుభూతి ఎటువంటి మానసిక దుస్థితిని అయినా దూరం చేస్తుంది, వైరస్ విలన్ మనను ఏమి చేయకుండా తరిమికొడుతుంది. మనం ఇప్పుడు వర్తమాన ప్రపంచ స్థితిని తరచూ చదవాల్సి వస్తుంది, చూడాల్సి ఉంటుంది. ఇది దారుణంగానే ఉంది. కళ్లముందుకు మదిలోనికి వచ్చే కదిలించే వార్త మనను ప్రభావితం చేస్తుంది, మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. ముందు మనం మన బలహీనతలను అధిగమిస్తే మనకు తిరుగులేని శక్తి ఏర్పడుతుంది. అప్పుడు ఏ వైరస్ ఏమి చేయలేదనే నిజాన్ని గ్రహిద్దాం అని పిలుపు నిచ్చారు.