శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను శివసేన నాయకుడి పదవి నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఉపసంహరించుకోని పక్షంలో దీన్ని షిండే న్యాయపరంగా సవాలు చేస్తారని తిరుగుబాటు ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ శనివారం తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాలడినందుకు షిండేను శివసేన నాయకుడి పదవి నుంచి తొలగిస్తున్నట్లు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే శుక్రవారం ప్రకటించారు. పార్టీ సభ్యత్వాన్ని షిండే స్వచ్ఛందంగా వదులుకున్నందున పార్టీ అధ్యక్షుడిగా తనకున్న అధికారాలతో ఆయనను పార్టీ సంస్థాగతంలో శివసేన నాయకుడిగా ఉన్న పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఒక లేఖలో థాక్రే తెలిపారు. దీనిపై గోవాలో ప్రస్తుతం బసచేసి ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఒకరైన దీపక్ కేసర్కర్ విలేకరులతో మాట్లాడుతూ తామంతా షిండేను తమ గ్రూపు నాయకుడిగా ఎన్నుకున్నామని, శాసనపక్ష గ్రూపు నాయకుడిగా షిండేను తొలగించడాన్ని కూడా తాము సుప్రీంకోర్టులో సవాలు చేశామని తెలిపారు. థాక్రేను తాము న్యాయపరంగా ఎదుర్కుంటామని ఆయన స్పష్టం చేశారు.