హైదరాబాద్ భక్తుని విరాళం
షిరిడీ: మహారాష్ట్రలోని ప్రసిద్ధ షిరిడీ సాయిబాబా ఆలయానికి రూ. 2 కోట్ల విలువైన స్వర్ణ కంకణాన్ని హైదరాబాద్‌కు చెందిన ఒక భక్తుడు విరాళంగా అందచేశారు. పార్థసారథిరెడ్డి అనే భక్తుడు షిరిడీలోని సాయిబాబా ఆలయానికి నాలుగు కిలోలకు పైగా బరువున్న స్వర్ణ కంకణాన్ని అందచేసినట్లు షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు సిఇఓ భాగశ్రీ బనాయత్ బుధవారం తెలిపారు. సాయిబాబా ఆలయంలోని బాబా పాలరాతి విగ్రహానికి బంగారు కంకణం విరాళంగా అందచేయాలని పార్థసారథి రెడ్డి 2016లోనే భావించారని, అయితే అందుకు అవసరమైన నియమ నిబంధనల మేరకు ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందని ఆమె తెలిపారు. కొవిడ్ కారణంగా ఇందులో మరింత జాప్యం ఏర్పడి ఎట్టకేలకు ఆయన బంగారంతో తయారుచేసిన కంకణాన్ని ఆలయానికి అందచేశారని ఆమె వివరించారు. 2007లో హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడు 94 కిలోల బరువైన బంగారు సింహాసనాన్ని సాయిబాబా ఆలయానికి అందచేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.