ముంబయి: మహారాష్ట్రలో శివసేన ఎంఎల్‌ఎ దిలీప్ లాండే అత్యుత్సాహం వివాదాస్పదంగా మారింది. ఓ పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌కు ఆయన బహిరంగ శిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబయి సహా పలు ప్రాంతాల్లో డ్రైనేజిలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లపై మురుగు నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆగ్రహం చెందిన చాందివాలి ఎంఎల్‌ఎ దిలీప్ లాండే స్థానిక పారిశుద్ధ కాంట్రాక్టర్‌ను పిలిపించి రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీటిలో కూర్చోబెట్టి పారిశుద్ధ కార్మికులతో ఆయనపై చెత్తను వేయించారు. ఈ నిర్వాకాన్ని సమర్థించుకున్న ఎంఎల్‌ఎ కాంట్రాక్టర్ సక్రమంగా పని చేయడం లేదని మండిపడ్డారు. అందుకే తానే వీధిలోకి వచ్చి డ్రెయిన్లను శుభ్రం చేయించాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఎంఎల్‌ఎ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గత 25 సంవత్సరాలుగా బృహన్ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ శివసేన చేతుల్లోనే ఉండడం గమనార్హం.