11వ తేదీన సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సేన చీఫ్‌విప్ సునీల్ ప్రభు దాఖలు చేసిన సస్పెన్షన్ పిటిషన్‌పై ఈ నెల 11వ తేదీన విచారణకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. షిండే సారథ్యపు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ దశలోనే వారి అధికార స్థాపన కుదరదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు సూర్యకాంత్, జెబి పర్దీవాలా సారధ్యపు ధర్మాసనం పరిశీలించి విచారణ తేదీని ఖరారు చేసింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యమంత్రితో పాటు ఇతరులపై అనర్హత ప్రక్రియ వాయిదా పడి ఉన్నందున తమ పిటిషన్‌ను అత్యవసర ప్రాతిపదికపై విచారించాల్సి ఉందని ధర్మాసనం ముందు సిబల్ తెలిపారు. దీనికి సమ్మతించిన ధర్మాసనం విచారణను 11వ తేదీన చేపడుతామని తెలిపింది. మహారాష్ట్రలో అధికార పక్షం అయిన శివసేనలో తిరుగుబాటు సుప్రీంకోర్టు వ్యాజ్యాల వరకూ దారితీసింది. క్యాంప్‌ల రాజకీయాలకు సాగిందిం. ఉద్ధవ్ థాకరే విశ్వాస పరీక్షకు గవర్నర్ వెలువరించిన ఆదేశాలను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు రెండు రోజుల క్రితం నిరాకరించింది. ఈ పరిణామంతో బలపరీక్షకు వెళ్లకుండానే థాకరే తమ పదవికి రాజీనామా చేశారు. దీనితో రాష్ట్రంలో షిండే సిఎంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది.