విచారణకు సహకరిస్తానని వెల్లడి
ముంబై : శివసేన ఎంపి సంజయ్ రౌత్ శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్ అభియోగాల సంబంధిత కేసులో దర్యాప్తు ప్రక్రియలో భాగంగా ఆయన వాంగ్మూలానికి ఇడి ఆదేశించింది. మహారాష్ట్రలో రాజకీయ నాటకీయ పరిణామాల దశలోనే ఇడి నుంచి రౌత్‌కు సమన్లు వెలువడ్డాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు రౌత్ దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న ఇడి ఆఫీసుకు వచ్చారు. ఈ పరిసరాలలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శివసేన కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో ఈ దారిలో ఉన్నారు. వారిని నిలువరించేందుకు బారికేడ్లు ఏర్పాటు అయ్యాయి. ఇడి విచారణకు తాను సహకరిస్తానని, వారికి కొన్ని అంశాలపై తన నుంచి వివరణ అవసరం అని, సమన్లకు అనుగుణంగా తాను హాజరు అవుతున్నానని లోపలికి వెళ్లే ముందు షిండే తెలిపారు. తన జీవితంలో తానేమీ తప్పు చేయలేదని, ఇక భయపడేందుకు ఏముంటుందని ప్రశ్నించారు. ఎంపిగా, దేశ పౌరుడిగా , రాజకీయ పార్టీ నేతగా దర్యాప్తు సంస్థ విచారణకు సహకరించడం తన బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఇడి సమన్లు వెలువడిన దశలో సంజయ్ రౌత్ తాను వీటిని పట్టించుకునే ప్రసక్తే లేదని తెలిపారు.