ఎంపి నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
ఎంపి అరవింద్ సావంత్‌పై పోలీస్ చర్యకు డిమాండ్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి థాక్రేకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఏమైనా మాట్లాడితే తనపై యాసిడ్ పోస్తానని, జైలుకు పంపిస్తానని మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తానని శివసేన ఎంపి అరవింద్ సావంత్ తనను బెదిరించారని సినీనటి, అమరావతి ఇండిపెండెంట్ ఎంపి నవనీత్ కౌర్ రానా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌కాల్స్‌లో ఈ బెదిరింపులతోపాటు శివసేన లెటర్‌హెడ్స్‌తో లేఖలు వచ్చాయని ఆమె స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను ఎంపి అరవింద్ సావంత్ ఖండించారు. ఆమెను ఎవరైనా బెదిరిస్తే ఆమెకు అండగా తాను నిలుస్తానని సావంత్ పేర్కొన్నారు. మార్చి 22తేదీతో బెదిరింపు లేఖ తనకు వచ్చిందని ఇది కేవలం తనకు జరిగిన అవమానం మాత్రమే కాదని, దేశం లోని మహిళలందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నానని నవనీత్ కౌర్ వివరించారు. ఎంపి అరవింద్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
లోక్‌సభ లాబీలో ఎదురుపడినప్పుడు మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తా .. నిన్ను జైల్లో పెట్టిస్తా అని సావంత్ తనను బెదిరించారని, దాంతో తనకు మతి పోయినట్టయి వెంటనే వెనకనున్న సహచర ఎంపి వైపు తిరిగి చూసి మీరు సావంత్ బెదిరింపులు విన్నారా అని అడగ్గా ఆ ఎంపి విన్నానని చెప్పారని నవనీత్ వివరించారు. సావంత్ బెదిరించినప్పుడు తన పక్కన సాక్షిగా రాజమండ్రి వైఎస్‌ఆర్ ఎంపి మార్గాని భరత్ రామ్ ఉన్నట్టు న్యూస్ ఏజెన్సీ ఎఎన్‌ఐకు నవనీత్ చెప్పింది. ముఖేష్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలతో వాహనం ఉన్న కేసులో సచిన్ వజేను మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై లోక్‌సభలో తీవ్ర చర్చ సాగుతోంది. లోక్‌సభలో దీనిపై నవనీత్ మాట్లాడుతూ మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి థాక్రే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.