కష్టాలలో కశ్మీరీలు..వేడుకల్లో బిజీగా రాజు
బిజెపిపై శివసేన ఎద్దేవా
ముంబై: కశ్మీరులో ఒక వర్గాన్ని లక్షంగా చేసుకుని జరుగుతున్న దాడులకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని శివసేన వ్యాఖ్యానించింది. కశ్మీరులో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే రాజు మాత్రం వేడుకల్లో బిజీగా ఉన్నారంటూ శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. మోడీ ప్రభుత్వం జరుపుకుంటున్న 8వ వార్షికోత్సవాలను శివసేన తన సొంత పత్రిక సామ్నాలో సోమవారం ప్రస్తావిస్తూ జమ్మూ కశ్మీరులో ఆర్టికల్ 370ని రద్దు చేయడం, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు జరపడం వంటి విజయాలపై బిజెపి గొప్పలు చెప్పుకోవడంలో బిజీగా ఉందని, అయితే కశ్మీరీ పండిట్ల కష్టాలపై మాత్రం పెదవి విప్పకపోవడం ఆశ్చర్యకరమని పేర్కొంది. బిజెపికి హిందూత్వ సిద్ధాంతంపై చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించిన కశ్మీరులో హిందువులను ఊచకోత కోస్తుంటే బిజెపి, కేంద్రం మౌనం వహించడాన్ని శివసేన తప్పుపట్టింది. సర్జికల్ దాడులతో బిజెపి రాజకీయ లబ్ధి పొందగా కశ్మీరులో హిందువుల పరిస్థితి మరింత దిగజారిందని శివసేన విచారం వ్యక్తం చేసింది. హిందూత్వ, జాతీయవాదంపై గొంతు చించుకునే బిజెపి నాయకులు హిందువులు నిజంగా ప్రమాదంలో పడినప్పుడు నోరు విప్పరని, కశ్మీరు లోయలో హిందువుల మారణకాండపై బిజెపి, కేంద్రం గొంతు విప్పడం లేదని శివసేన విమర్శించింది. సర్జికల్ దాడుల బాంబులు ఎక్కడ పేలాయంటూ శివసేన ప్రశ్నించింది.
Shiv Sena slams PM Modi’s Govt Over Kashmir Killings