పాన్ వివరాలు లేకుండా 1,026 విరాళాలు స్వీకరించిన 16 ప్రాంతీయ పార్టీలు
ఎడిఆర్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో 16 ప్రాంతీయ పార్టీలు రూ.24.779 కోట్ల విలువైన 1,026 విరాళాలను పాన్ వివరాలు లేకుండా స్వీకరించినట్లు ప్రకటించాయని ఎన్నికల హక్కులకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) నివేదిక వెల్లడించింది. ఎన్నికల కమిషన్‌కు రాజకీయ పార్టీలు 2019 20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన వివరాల ఆధారంగా ఎడిఆర్ ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం 2018 19, 2019 20 మధ్య కాలంలో జార్ఖండ్ ముక్తిమోర్చా( జెఎంఎం), లోక్‌జనశక్తి పార్టీ, సమాజ్‌వాది పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు విరాళాల ద్వారా వచ్చిన ఆదాయం గరిష్ఠ శాతం పెరిగింది. కాగా 2019 20 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విరాళాలు ప్రకటించిన టాప్5 పార్టీల్లో శివసేన, ఎఐఎడిఎంకె, ఆప్, బిజూ జనతా దళ్, వైఎస్‌ఆర్‌సిపి ఉన్నాయి.
వీటిలో శివసేన, బిజెడి, వైఎస్‌ఆర్ సిపిలు తమ విరాళాల తగ్గినట్లు ప్రకటించగా, ఎఐఎడిఎంకె, ఆప్‌ల విరాళాలు మాత్రం 2018 19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పెరిగాయని ఆ నివేదిక పేర్కొంది. నగదు రూపంలో గరిష్ఠంగా విరాళాలు సేకరించినట్లు ప్రకటించిన పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లింంలీగ్. కాగా, ఆ పార్టీ నగదు రూపంలో రూ.4.63 కోట్లు సేకరించగా తమిళనాడుకు చెందిన పట్టాలి మక్కళ్ కచ్చి( పిఎంకె) రూ.52.20 లక్షలు, ఎల్‌జెపి రూ.6 లక్షలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నాగాలాండ్, మణిపూర్‌కు చెందిన నాగా పీపుల్స్‌ఫ్రంట్ రూ.3.92 లక్షలు, ద్రవిడ మున్నేట్ర కళగం( డిఎంకె) రూ.29,000 నగదు రూపంలో విరాళాలు సేకరించాయి.16 ప్రాంతీయ పార్టీలు రూ.24.799 కోట్ల విలువైన 1,026 విరాళాలను పాన్ వివరాలు లేకుండా అందుకున్నట్లు ప్రకటించాయని ఆ నివేదిక తెలిపింది. ఈ నివేదిక మొత్తం 56 పార్టీల విరాళాలను విశ్లేషించగా, రెండు పార్టీలు మాత్రమే నిర్ణీత గడువు లోగా ఎన్నికల కమిషన్‌కు విరాళాల వివరాలను సమర్పించగా, మరో 28 పార్టీలు ఆలస్యంగా వివరాలు సమర్పించాయి.
2019 20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ విరాళాల వివరాలను ఇప్పటికీ ఇసికి సమర్పించని ప్రాంతీయ పార్టీలు 23 ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు విరాళాలుఅందుకున్న ఆరు రోజులనుంచి 320 రోజుల్లోగా ఇసికి వాటి వివరాలను సమర్పించాలి. కాగా విరాళాల ద్వారా సేకరించిన మొత్ంత సొమ్ముకు సంబంధించి శివసేన అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీ 436 విరాళాల ద్వారా రూ.62.859 కోట్లు అందుకొంది. ఎఐఎడిఎంకె మూడు విరాళాల ద్వారా రూ.52.17 కోట్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ రూ.37.37 కోట్లతో మూడో స్థానంలో ఉంది.