శివసేన ఎంపి సంజయ్ రౌత్ వెల్లడి
ముంబై : వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న ఉత్తరప్రదేశ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో శివసేనకు మద్దతు ఇవ్వడానికి రైతు సంఘాలు సిద్ధంగా ఉన్నాయని శివసేన ఎంపి సంజయ్ రౌత్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 నియోజక వర్గాలుండగా, శివసేన 80 నుంచి 100 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి నిలబెడుతుందని అలాగే 40 అసెంబ్లీ నియోజక వర్గాలున్న గోవాలో 20 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు చెప్పారు. శివసేనకు రైతు సంఘాల మద్దతుతోపాటు చిన్న పార్టీలతో పొత్తు ఉండవచ్చని చెప్పారు. గోవా లోనూ మహా వికాస్ అఘాడీ ఫార్ములా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ శివసేనకు క్యాడర్ ఉందని, గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామాపై ప్రశ్నించగా, ఇది బిజెపి అంతర్గత వ్యవహారమని,బయటి వ్యక్తులు వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదన్నారు. రూపానీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసని అన్నారు.