శివబాలకృష్ణ అక్రమాలకు ఓ ఐఎఎస్ అండ
సదరు అధికారికి కోట్లాది రూపాయల ముడుపు అందించినట్లు నేరాంగీకారం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆదాయానికి మించిన అక్రమాస్తులను కూడబెట్టిన కేసులో హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ నేరాంగీకార పత్రంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎసిబి విచారణలో ఓ ఐఎఎస్ అధికారి పేరును శివ బాలకృష్ణ ప్రస్తావించినట్లు సమాచారం. తన నుంచి సదరు ఐఏఎస్ అధికారికి కావాల్సిన భవనాలకు అనుమతులు జారీ చేయించుకున్నారని బాలకృష్ణ ఎసిబి అధికారులకు వెల్లడించారని తెలుస్తోంది. నార్సింగిలోని వివాదాస్పద భూమికి సంబంధించి బాలకృష్ణ అడ్డగోలు అనుమతులు ఇచ్చారని అధికారులు గుర్తించారు. ఐఎఎస్ అధికారి ఆదేశాలతోనే భూమికి క్లియరెన్స్ ఇచ్చిన్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చిన్నట్లు సమాచారం. నార్సింగిలోని ఓ ప్రాజెక్ట్ అనుమతి కోసం ఐఏఎస్ రూ.10 కోట్లు లంచం డిమాండ్ చేశారని ఎసిబి అధికారులకు రేరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణ చెప్పినట్లు సమాచారం. డిమాండ్ చేసిన రూ.10 కోట్లలో కోటి రూపాయలు చెల్లింపులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గత డిసెంబర్‌లో బాలకృష్ణ ద్వారా ఐఎఎస్‌కు కోటి రూపాయలు చేరినట్లు సమాచారం. బాలకృష్ణ నేరాంగీకార పత్రంలో తెలిపిన విషయాల ఆధారంగా ఎసిబి అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.
శివ నవీన్ కుమార్ ఈ కేసులో అత్యంత కీలక వ్యక్తి..?
ఎసిబి అరెస్టు చేసిన శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ఈ కేసులో అత్యంత కీలక వ్యక్తి అని ఎసిబి వర్గాలు చెబుతున్నాయి. ఎవరి నుంచి ఎంత మొత్తం తీసుకోవాలి.? వాటిని ఎక్కడికి మళ్లించాలి.? ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి?.. ఇలా అన్ని వ్యవహారాలను నవీన్ కుమార్ చక్కబెట్టే వాడని వివరించాయి. నిధులను దారి మళ్లించేందుకు నవీన్ కుమార్ రెండు డొల్ల కంపెనీ లను ఏర్పాటు చేసినట్లు ఎసిబి అధికారులు పూర్తి ఆధారాలను సేకరించారు. ఆ కంపెనీల పేర్లతో ఐటి సైతం చెల్లించినట్లు గుర్తించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణకు నవీన్ కుమార్ సరిగా సహకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో డాక్యుమెంట్స్, టెక్నికల్ ఎవిడెన్స్ పై ఎసిబి అధికారులు దృష్టిసారించారు. నవీన్ కస్టడీకి కోర్టులో పిటిషన్ వేయనున్నారు. మరోవైపు, శివబాలకృష్ణ వాంగ్మూలంలో పేర్కొన్న స్థిరాస్తి సంస్థలకూ నోటీసులు జారీ చేసి, విచారించేందుకు ఎసిబి మరోవైపు సన్నద్ధమవుతోంది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు కూడా పలు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను విచారించినా ఇప్పుడు శివ బాలకృష్ణ వాంగ్మూలం మేరకు వారిని ఎసిబి అధికారులు ప్రశ్నించే ఆస్కారముంది.