Wednesday, January 22, 2025

అజారుద్దీన్ నియంతలా మారాడు

- Advertisement -
- Advertisement -

అజారుద్దీన్ నియంతలా మారాడు
హెచ్‌సిఎలో అవినీతి రాజ్యమేలుతోంది
ప్రతిభావంతుకు తీరని అన్యాయం
అజర్ తీరుపై ధ్వజమెత్తిన అర్షద్, శివలాల్, శేష్ నారాయణ్
మన తెలంగాణ/హైదరబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ప్రస్తుత హెచ్‌సిఎ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ వ్యవహారశైలీపై సభ్యులు మరోసారి ధ్వజమెత్తారు. సోమవారం ఫతేమైదాన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్‌సిఎ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్, భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, హెచ్‌సిఎ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ తదితరులు అజారుద్దీన్ వైఖరీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ సంఘం మొత్తం అవినీతి మయంగా మారిపోయిందని ఆరోపించారు. అజారుద్దీన్ నియంతగా వ్యవహరిస్తూ హైదరాబాద్ క్రికెట్‌ను భ్రష్ఠుపట్టిస్తున్నాడని విమర్శలు గుప్పించారు. కాసుల కక్కూర్తితో ప్రతిభకు పాతరేస్తున్నాడని విమర్శించారు. మూడేళ్లుగా ఆడిట్ రిపోర్టును దాచి పెట్టి అక్రమాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నాడని దుయ్యబట్టారు. తొలుత అర్షద్ అయూబ్ మాట్లాడుతూ అజారుద్దీన్ అగడాలను ఏకరవు పెట్టారు. హైదరాబాద్ జట్టులో ప్రతిభావంతులైన క్రికెటర్లకు చోటు దక్కడం లేదని, డబ్బులు ఇచ్చిన వారికే జట్టులో చోటు లభిస్తుందని ఆరోపించారు. అజారుద్దీన్ అవినీతి, కాసుల కక్కూర్తి వల్ల ప్రతిభావంతులైన ఆటగాళ్లకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు.

అపెక్స్ కౌన్సిల్, ఎజిఎం, హెచ్‌సిఎ రాజ్యాంగం దేనితోనూ సంబంధం లేకుండా అన్ని వ్యవస్థలను అజారుద్దీన్ నిర్వీర్యం చేసి ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడని అర్షద్ విమర్శించారు. అజర్ చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్న వారిపై కక్షపూరిత చర్యలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ కూడా అజారుద్దీన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిభ గల క్రికెటర్లకు అన్యాయం జరుగుతున్నా, హెచ్‌సిఎ పాలన వ్యవహారాలు గాపి తప్పుతున్నా ఎవరు నొరెత్తకూడదు, ప్రశ్నించకూడదన్నట్టు అజారుద్దీన్ ప్రవర్తిస్తున్నాడని శివలాల్ మండిపడ్డారు. మాజీ కార్యదర్శి శేష్‌నారాయణ్ మాట్లాడుతూ హెచ్‌సిఎలో జవాబుదారీతనం పోయి నియంతృత్వం వచ్చిందని విమర్శించారు. హెచ్‌సిఎ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిపోయిందన్నారు. అజార్దున్ ఒంటెత్తు పోకడలతో హైదరాబాద్ క్రికెట్ సంఘానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్యానెల్‌గా పోటీ చేసి ఎన్నికైన కార్యవర్గ సభ్యులే తర్వాత ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అపెక్స్ కౌన్సిల్ అభిప్రాయాలతో కూడా సంబంధం లేకుండా అజారుద్దీన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ హెచ్‌సిఎకు తీరని అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు. ఈ సమావేశంలో హెచ్‌సిఎ ఉపాధ్యక్షుడు జాన్ మనజ్, సంయుక్త కార్యదర్శి నరేశ్ శఱ్మ, హెచ్‌సిఎ మాజీ ప్రతినిధులు దేవ్‌రాజ్, చిట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Shiva Lal Yadav Slam Azharuddin Corruption in HCA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News