న్యూస్‌డెస్క్: కర్నాటకలోని బిజెపి ప్రభుత్వంపై శివసేన(ఉద్ధవ్ థాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ బుధవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కర్నాటకలో ప్రవేశించడానికి తమకు ఎవరి అనుమతి అవసరం లేదని, భారత భూభాగంలోకి చైనా సేనలు చొరబడిన తరహాలోనే తాము కూడా కర్నాటకలోకి ప్రవేశిస్తామని రౌత్ హెచ్చరించారు. కర్నాటక, మహారాష్ట్ర మధ్య చిచ్చు రాజేస్తోంది కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అంటూ ఆయన ఆరోపించారు.
రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్యపై చర్చలు జరిపి పరిష్కారం కనుగొనాలన్నది తమ అభిమతమని, కాని కర్నాటక ముఖ్యమంత్రి బొమ్మై చిచ్చు రాజేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రలో అత్యంత దుర్బల ప్రభుత్వం ఉందని, సరిహద్దు సమస్యపై ఎటువంటి వైఖరి తీసుకోలేకపోతోందని ఆయన అన్నారు. మరాఠీ మాట్లాడే ప్రజలు అధిక శాతం మంది ఉన్న కర్నాటకలోఇ బెలగావి, మరి కొన్ని ప్రాంతాలను తమ రాష్ట్రంలో విలీనం చేయాలని మహారాష్ట్ర డమాండు చేస్తుండగా దీన్ని కర్నాటక వ్యతిరేకిస్తోంది.