Friday, September 20, 2024

షిండే సేనకు మేలు!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: మహారాష్ట్రలో రెండు శివసేనల మధ్య రగులుతున్న అగ్గికి కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) ఉత్తర్వు ఆజ్యంలా తోడైంది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు (విల్లంబులు) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికే చెందుతాయని గత శుక్రవారం నాడు సిఇసి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే షిండే వర్గం గత జూన్‌లో అప్పటి పాలక శివసేనను చీల్చి భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి రెండు వర్గాల మధ్య పచ్చిగడ్డి కూడా భగ్గుమంటున్న స్థితికి సిఇసి తాజా ఉత్తర్వు తెర దించడం లేదు. దానిని సవాలు చేస్తూ ఉద్ధవ్ థాక్రే వర్గం సోమవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

గత ఎన్నికల్లో శివసేన గెలుచుకొన్న 55 అసెంబ్లీ స్థానాల ఎంఎల్‌ఎలలో మెజారిటీ సభ్యులు (40 మంది) షిండే వర్గంలో వున్నారు. అలాగే ఉమ్మడి శివసేన తరపున ఎన్నికైన మొత్తం 18 మంది ఎంపిల్లో ఎక్కువ మంది (12 మంది) ఆ వర్గంలోనే వున్నారు. ఎన్నికల సంఘం తన ఉత్తర్వులకు మద్దతుగా ఈ గణాంకాలనే తీసుకొన్నట్టు అర్థమవుతున్నది. అందుచేత సిఇసి నిర్ణయం ప్రస్తుతానికి నిర్వివాదమైనదిగానే పరిగణన పొందుతుంది. అయితే ఎన్‌డిఎ పాలనలో ఎన్నికల సంఘం తన నిషాక్షికతను కోల్పోయి చాలా కాలమైనందున ఈ నిర్ణయం వివాదాస్పదమవుతున్నది. వాస్తవానికి ఇసి ఇంతకు ముందే ఉద్ధవ్ థాక్రే వర్గానికి వేరే ఎన్నికల గుర్తును, పేరును కేటాయించింది. గుర్తులు, పార్టీల పేర్లు ఎవరికి చెందివున్నప్పటికీ ప్రజలు ఎటువైపు వున్నారనే దాని మీదనే అంతా ఆధారపడి వుంటుంది.

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఈ రెండు వర్గాల్లో దేనిది పైచేయి అవుతుందనేది చాలా కీలకమైన అంశం. అధికారంలో వున్న షిండే వర్గం బిజెపి దర్శకత్వంలో కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే తపనతో పావులు కదుపుతున్నది. గత ఏడాది దసరా ఉత్సవాల్లో రెండు వర్గాలు పోటాపోటీగా బలప్రదర్శనకు తలపడ్డాయి. ఏటా దసరాకి శివసేన ఉత్సవాలు సెంట్రల్ ముంబైలోని శివాజీ పారులో జరుగుతూ వుండేవి. ఉద్ధవ్ థాక్రే తండ్రి బాల్ థాక్రే 1966లో శివసేనను నెలకొల్పినప్పటి నుంచి అకడే జరుగుతూ వచ్చిన ఈ ఉత్సవాలు గత ఏడాది రెండు వర్గాల ఆధ్వర్యంలో వేర్వేరు వేదికలను ఆశ్రయించాయి. శివసేన దసరా ఉత్సవాలు జరుపుకోడానికి థాక్రే వర్గానికి దాదర్ గ్రౌండ్‌ను ముంబై హైకోర్టు కేటాయించింది. షిండే వర్గానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్‌డిఎ) తన సొంత బంద్రా కుర్లా కాంప్లెక్స్ గ్రౌండ్‌ను కేటాయించింది. రెండు వర్గాలు తమ తమ ఉత్సవాలకు అత్యధిక సంఖ్యలో శివ సైనికులను ఆకర్షించడానికి అన్ని ప్రయత్నాలు చేశాయి.

అయితే ఉద్ధవ్ థాక్రే వర్గానిదే పైచేయిగా నిరూపణ అయినట్టు వార్తలు చెప్పాయి. దీనిని బట్టి మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు శివ సైనికుల్లో గణనీయమైన మద్దతు కొనసాగుతున్నదని అనుకోవలసి వున్నది. బాల్ థాక్రేను అనుసరించి నడిచిన వారు సహజంగానే ఉద్ధవ్ థాక్రే పట్ల సానుభూతి కలిగి వుండే అవకాశముంది. అలాగే కేంద్రంలోని బిజెపి పాలకులు మహారాష్ట్రలో అధికారం కోసం అడ్డదారిలో పావులు కదిపిన తీరు పట్ల, ఏక్‌నాథ్ షిండేను మంత్రించి శివసేనను చీల్చిన పద్ధతి పట్ల వారిలో ఆగ్రహం రగిలి వుండే అవకాశమే కనిపిస్తున్నది. అందుచేత ఉద్ధవ్ థాక్రే వర్గాన్ని ఎన్నికల్లో ఓడించడం బిజెపికి గాని, షిండే వర్గానికి గాని సునాయాసం కాబోదు. అలాగే శివసేన రెండు వర్గాలు మహారాష్ట్రలో ప్రాభవం కోల్పోయి వచ్చే ఎన్నికల్లో అల్ప శక్తులుగా మారిపోయే ప్రమాదమూ లేకపోలేదని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఒకవైపు బిజెపి, మరోవైపు శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) వుండి మహారాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయని వీరు అంచనా వేస్తున్నారు.

షిండే వర్గంలోకి ఫిరాయించిన ఎంఎల్‌ఎల సభ్యత్వాలను రద్దు చేయాలంటూ ఉద్ధవ్ థాక్రే వర్గం దాఖలు చేసుకొన్న పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో వున్నది. దీనిపై నిర్ణయాన్ని తీసుకునే ముందు సభ్యత్వాల రద్దుకు స్పీకర్‌కు వున్న అధికారాలపై మీమాంస కొనసాగుతున్నది. స్పీకర్‌ను తొలగించాలంటూ నోటీసు ఇచ్చిన తర్వాత సభ్యత్వాల రద్దు హక్కు ఆ స్పీకర్‌కు వుంటుందా అనే ప్రశ్న కూడా తలెత్తింది. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించే వరకు పార్టీ పేరు, గుర్తుపై ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని ఉద్ధవ్ థాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఇసి నిర్ణయాన్ని ప్రకటించేసింది గనుక సుప్రీంకోర్టు తీర్పు వరకు వేచి వుండే అవకాశం లేదు. అంతిమంగా మహారాష్ట్ర ప్రజలు, లక్షలాదిగా వుండగల శివ సైనికులు ఎటు మొగ్గుతారనేదే ఈ రెండు వర్గాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఉమ్మడి శివసేనకున్న ఆస్తుల భవిష్యత్తు కూడా అప్పుడే తేలుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News