Friday, December 27, 2024

11 మందిని వివాహమాడిన నిత్య పెళ్లికొడుకు

- Advertisement -
- Advertisement -

కఠినంగా శిక్షించి, న్యాయం చేయాలని ఇద్దరు బాధిత మహిళల డిమాండ్

Shiva shanker babu marriages 11 womens

మన తెలంగాణ/హైదరాబాద్ : ఏకంగా ఓ వ్యక్తి 11 మందిని వివాహమాడాడు. అంతే కాదు వారి వద్ద నుంచి అందినకాడికి డబ్బులు దండుకుని ఆ తర్వాత వదిలేశాడు. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేసిన నిత్య పెళ్లికొడుకు వ్యవహారం తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే ఎపిలోని గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివశంకర్‌బాబు వివాహ పరిచయ వేదిక ద్వారా పలువురు యువతులను పరిచయం చేసుకున్నాడు. వివాహమై విడాకులు తీసుకున్న యువతులే లక్షంగా ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. కాగా, మోసపోయిన యువతులు అందరూ ఉన్నత విద్యనభ్యసించినవారే కావడం గమనార్హం.

శివశంకర్ మోసానికి బలైన ఇద్దరు యువతులు హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ నిత్య పెళ్లికొడుకు బాగోతాన్ని బట్టబయలు చేశారు. శివశంకర్ ఇప్పటికే చాలా మందిని మోసం చేసినట్లు తమకు సమాచారం ఉందని బాధితులు తెలిపారు. పెళ్లి పేరుతో తమను మోసం చేశాడని, దాదాపు 60 లక్షల వరకు నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చామని బాధిత మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఏ ఉద్యోగం లేని శివశంకర్ క్లయింట్ వద్దకు వెళ్తున్నానని చెప్పి వేరే భార్యల దగ్గరకు వెళ్లేవాడని వాపోయారు. మోసపోయిన 11 మందిలో ఏడుగురు కొండాపూర్ ప్రాంతంలోనే ఉన్నారని, వారందరినీ పక్క పక్క వీధుల్లో ఉంచుతూ ఈ మోసానికి పాల్పడ్డారని బాధిత మహిళలు చెబుతున్నారు.

ఎపికి చెందిన ఓ మంత్రి బంధువునని శివశంకర్ చెప్పినట్లు పేర్కొన్నారు. తమలా మరికొంతమంది మోసపోకూడదనే ఉద్దేశంతోనే తాము మీడియా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే శివశంకర్‌పై పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు ఉన్నా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. ఇప్పటికైనా శివశంకర్‌ను శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News