కర్నాటక లోకాయుక్త పోలీసులు నమోదు
సిబిఐ నుంచి కేసు బదలీకి నిరీక్షణ
బెంగళూరు : కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌పై అక్రమ ఆస్తుల (డిఎ) కేసును రాష్ట్ర లోకాయుక్త పోలీసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ నుంచి తమకు కేసు బదలీ అవుతుందని ఊహించి పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. కర్నాటక కాంగ్రెస్ చీఫ్ కూడా అయిన శివకుమార్‌పై నమోదు చేసిన అక్రమ ఆస్తుల కేసులో ఆయన ప్రాసిక్యూషన్‌కు సిబిఐకి అనుమతి మంజూరుకు పూర్వపు బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కర్నాటక మంత్రివర్గం గత నవంబర్‌లో ఉపసంహరించింది.
చట్ట ప్రకారం అనుమతి మంజూరు చేయలేదని ఆ సమయంలో మంత్రివర్గం స్పష్టం చేసింది. సిబిఐ నుంచి లోకాయుక్తకు కేసు బదలీ జరుగుతుందని లోకాయుక్త పోలీసులు ఆశిస్తున్నారని లోకాయుక్త సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, తమకు అనుమతి మంజూరును ఉపసంహరిస్తున్న ప్రభుత్వ ఉత్తర్వును కర్నాటక హైకోర్టులో సిబిఐ సవాల్ చేసిందని ఆయన తెలిపారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు లోకాయుక్త నిబద్ధమై ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం మేము కేసు నమోదు చేశాం. కేసు మాకు బదలీ అవుతుందేమో చూసేందుకు కోర్టు నిర్ణయం కోసంమేము నిరీక్షిస్తున్నాం’ అని ఆ అధికారి చెప్పారు. కోర్టు ఎటువంటి పరిమితులూ విధించనందున కేసు దర్యాప్తునకు లోకాయుక్తపై ప్రస్తుతం ఎటువంటి నిషేధమూ లేదని ఆయన తెలిపారు. అయితే, ‘కేసు పత్రాలను సిబిఐ బదలీ చేయకపోతే ఏదో ప్రాథమిక దర్యాప్తు మినహా మేము చేయగలిగేది ఏమీ లేదు. అర్థవంతమైన దర్యాప్తు జరగడానికి హైకోర్టు ఉత్తర్వు కోసం మేము నిరీక్షిస్తున్నాం. హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుస్తాం’ అని ఆ అధికారి వివరించారు.