సిద్దిపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని మల్లన్నకు నిరంతరంగా అభిషేకాలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. కొమురవెల్లి మహాశిరాత్రి లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి నిర్వహించే పెద్దపట్నం తిలకించేందుకు తెలంగాణ రాష్ట్రంలో పాటు ఎపి, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. కొమురవెల్లి గుట్టలన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. మల్లికార్జున స్వామి ఆలయ గర్భగుడిలో శివలింగంతో పాటు పుట్టు లింగాలకు భక్తులు అభిషేకాలు నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో ఆలయ గర్భగుడిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తుండగా అదే సమయంలో మల్లన్న ఆలయ సమీపంలోని తోటబావి వద్ద మల్లన్న కల్యాణ మండపం వద్ద ఒగ్గు పూజారులు పెద్ద పట్నం నిర్వహిస్తారు. సిద్దిపేట జిల్లాకు తలమానికమైన కొమురవెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్ద పట్నంకు ఆలయ అధికారులు, ఆలయ ధర్మకర్తల మండలి పోలీసు శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మల్లన్నను దర్శించుకన్న ఎన్నికల ప్రధాన అధికారి
కొమురవెల్లి మల్లికార్జున స్వామిని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శశాంక గోయల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ చైర్మన్ దువ్వల మల్లయ్యతో పాటు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ప్రసాదాలు అందజేసి సన్మానం చేశారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఈవో బాలాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నరేందర్‌రెడ్డి, ఏఈవో అంజయ్య, శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల చంద్రశేఖర్‌తో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.