న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. భోపాల్ నుంచి ఢిల్లీ వరకూ ఆయన విమానంలో విరిగిన సీటులోగంటన్నర సేపు ప్రయాణించారు. ఈ విషయంపై ప్రముఖ ఏయిర్‌లైన్స్ ఎయిర్‌ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు.
‘ఎయిర్‌ఇండియా ఫ్లైట్ నెంబర్ ఎఐ436లో నేను సీట్ బుక్ చేసుకుంటే.. నాకు 8సి సీటును కేటాయించారు. నేను వెళ్లి అందులో కూర్చొగా.. అది విరిగిపోయి.. కుంగిపోయి ఉంది. అందులో కూర్చోవడం చాలా అసౌకర్యంగా అనిపించింది’ అని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు. సిబ్బంది ఈ విషయాన్ని వివరిస్తే.. ఈ సమస్యను సంస్థ చాలా ఆలస్యంగా గుర్తించిందని.. ఈ సీటు టికెట్ విక్రయించ కూడదని ఆదేశించారని వారు అన్నారని శివరాజ్ సింగ్ అన్నారు. కానీ విమానంలో అదొక్కటే కాకుండా అలాంటి సీట్లు చాలానే ఉన్నట్లు వాళ్లు అన్నారని ఆయన తెలిపారు. తోటి ప్రయాణికులు వారి సీటు తనకు ఇస్తామని అన్నారు.. కానీ, వాళ్లకి ఇబ్బంది కలగకూడదని.. అదే సీటులో ప్రయాణించాను అని ఆయన అన్నారు.
టికెట్ ధరలను పూర్తిగా వసూలు చేసి అసౌకర్యమైన సీట్లను కేటాయిచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ఆయన హితవు పలికారు. అయితే మంత్రి ట్వీట్‌కు ఎయిర్‌లైన్ సంస్థ క్షమాపణ చెప్పింది.