Wednesday, January 22, 2025

సిఎం కుర్చీ ఎప్పుడూ నా లక్ష్యం కాదు

- Advertisement -
- Advertisement -

శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కొనసాగిస్తారా లేక కొత్త పేరు తెరపైకి వస్తుందా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పుడూ తన లక్ష్యం కాదని ఆయన మంగళవారం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవికి తాను గతంలో పోటీదారుగా లేనని, ఇప్పుడు కూడా లేనని ఆయన అన్నారు.‘ ఒక పార్టీ కార్యకర్తగా నాకు అప్పగించిన బాధ్యతను శక్తిమేరకు, అంకిత భావం, నిజాయితీతో కొనసాగించా. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో పని చేయడం నా అదృష్టం.

మోడీ ఎప్పటికీ మా నాయకుడే. ఆయన కింద పని చేయడానికి నేను ఎప్పుడూ గర్విస్తా’అని చౌహాన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన క్రెడిట్‌ను చౌహాన్ దక్కించుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 163 సీట్లతో బిజెపి ఘన విజయం సాధించడంతో మరోసారి ఆయన పేరు మార్మోగుతోంది. శివరాజ్ సింగ్‌ను బిజెపి అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనప్పటికీ ఆయన తనదైన శైలిలో ప్రచారం లో దూసుకుపోయారు. ‘లాడ్లీ బెహ్నా’ వంటి పథకంతో ఒక్కసారిగా ఓట్ల సునామీ సృష్టించారు.

ఈ నేపథ్యంలో మరోసారి సిఎంగా అధిష్ఠానం ఆయన పేరును ప్రకటించనుందా అని భోపాల్‌లో ఓ కార్యక్రమం అనంతరం విలేఖరులు అడిగిన ప్రశ్నకు నవ్వుతూ ఆయన సమాధానమిచ్చారు.‘ రేపు నేను ఢిల్లీకి వెళ్లడం లేదు. చింద్వారా వెళ్తున్నాను.అక్కడ 7 విధాన సభ స్థానాలుండగా, మొత్తం అన్నిటినీ మా పార్టీ గెలుచుకోలేదు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 29 స్థానాలు బిజెపి ఖాతాలో పడాలని, మోడీ మరోసారి దేశ ప్రధాని కావాలని నేను బలంగా నిర్ణయం తీసుకున్నా’ అని చౌహాన్ చెప్పారు.

కాగా నవంబర్ 17 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది బిజెపి ప్రకటించలేదు. ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు చౌహాన్‌నే సిఎంగా కొనసాగిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరించి పలువురు కేంద్రమంత్రులను కూడాఈ సారి అసెంబ్లీకి నిలబెట్టడంతో వీరిలో ఒకరిని సిఎం అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలపై కూడా ఊహాగానాలు వస్తున్నాయి. వీరిలో ప్రధానంగా జ్యోతిరాదిత్య సింధియా, కైలాష్ విజయ వర్గీయ పేర్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News