మహిళల రక్షణకు పాటించవలసిన ‘సూక్తి ముక్తావళి’ ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల బహిరంగంగానే ప్రవచించారు. ఇంటి నుంచి బయట అడుగు పెట్టే ముందు ప్రతి మహిళ ఆ విషయాన్ని పోలీసు స్టేషన్‌కు తెలియజేయాలని తాను ఎక్కడికి వెళుతున్నానో చెప్పాలని ఆ సమాచారాన్ని ఆధారం చేసుకొని పోలీసులు ఆమెకు ఎటువంటి ముప్పు కలగకుండా రక్షణ కల్పిస్తారని ఆయన అన్నారు. దీనిని అమల్లోకి తెచ్చే వ్యవస్థను, యంత్రాంగాన్ని ఆ రాష్ట్రంలో నెలకొల్పదలచినట్టు చెప్పారు. మహిళల పై నేరాలను గురించి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఉద్దేశించిన సమ్మాన్ అనే కార్యక్రమాన్ని పది రోజుల క్రితం ప్రారంభిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఫిర్యాదు ఇచ్చినా ఏమీ చేయడం లేదని చేతులు ముడుచుకు కూచున్నారని పోలీసులను నిందించడం సరికాదని కూడా ఆయన ఈ సందర్భంలో అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలు వివాహం చేసుకోడానికి కనీస వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని సూచించారు.
దేశంలోని మహిళల పట్ల ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని నారీజన రక్షణ పట్ల మాన్య ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు గల బాధ్యతాయుత దృష్టిని గౌరవించవలసిందే. అదే సమయంలో ఆయన ఈ సూచన చేయడం ద్వారా మహిళలకు గల గోప్యత హక్కును కాలరాశారని చెప్పక తప్పదు. స్త్రీ అయినా పురుషుడైనా మరెవరైనా తాము ఎక్కడికి వెళుతున్నామనే విషయాన్ని ఎవరికీ చెప్పవలసిన పని లేదు. అది వారి వ్యక్తిగత విషయం. సామాజిక మాధ్యమాల నిర్వాహకులు తమ వినియోగదార్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే గగ్గోలు ఇప్పటికే మిన్ను ముట్టింది. వాట్సాప్ సంస్థ తనను వినియోగిస్తున్న వారి సమాచారాన్ని తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు అందజేస్తానని ప్రకటించి అభాసుపాలైన విషయం తెలిసిందే. దేశంలోని పౌరుల గోప్యత హక్కు భారత రాజ్యాంగం హామీ ఇస్తున్న ప్రాథమిక హక్కుల్లో భాగమేనని 2017 ఆగస్టులో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహార్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ హక్కును రాజ్యాంగం 21వ అధికరణ కూడా కాపాడుతున్నదని పేర్కొన్నది.
ఒక స్త్రీ ఇంటి నుంచి బయటకు వెళ్లడమే ఆమె భద్రతకు ముప్పు కలిగించే అంశమని భావించవలసి రావడమంటే ఆమెకు భారత రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛాయుత సంచార హక్కు, జీవన హక్కు పూర్తిగా లోపించాయని అంగీకరించడమే. ఈ విషయాన్ని గమనించకుండా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి స్త్రీలు తాము ఎక్కడికి వెళుతున్నామో ముందుగా పోలీసులకు తెలియజేయాలనడం దారుణం. పోలీసులకు చెప్పకుండా బయటకు వెళ్లే స్త్రీ భద్రతకు తమ పూచీ లేదని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. మామూలు మనుషులు తీరిగ్గా కూచొని అవాకులు చవాకులు పేలుతూ వెలిబుచ్చే అభిప్రాయాలనే ప్రజాస్వామిక ప్రభుత్వాల్లో బాధ్యత గల పదవులు నిర్వహిస్తున్న వారి నోట వినవలసి రావడం ఎంతైనా బాధాకరం. కుల, మత, ప్రాంత, భాష, లింగ తదితర తేడాలు లేకుండా దేశ ప్రజలందరికీ సమాన స్థితిని హామీ ఇస్తున్న రాజ్యాంగం కింద భారత దేశం మనుగడ సాగిస్తున్నది. ఇక్కడ మగవారికున్న స్వేచ్ఛలను స్త్రీలు అనుభవించరాదని కీలక పదవుల్లో ఉన్న వారు చెప్పడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, ధిక్కరించడం కిందికే వస్తుంది.
షహీన్ బాగ్‌లో లక్షల సంఖ్యలో చేరిన వారు మీ ఇళ్లల్లో చొరబడి మీ అక్కా చెల్లెళ్లపై, కుమార్తెలపై అత్యాచారానికి ఒడిగట్టవచ్చు అంటూ గత ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఒక బిజెపి ఎంపి చేసిన హెచ్చరిక దేశంలోని మహిళల రక్షణ బాధ్యత ప్రభుత్వానిది కాదని చెప్పడమే తప్ప మరొకటి కాదు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల సాయంత్రం వేళ గుడికి వెళ్లి అక్కడి పూజారి, అతడి స్నేహితుల కాముకతకు బలైపోయిన ఒక మహిళ ఉదంతంలో ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిం చిన జాతీయ మహిళా సంఘం సభ్యురాలు ఒకరు విచిత్రంగా మాట్లాడారు. ఆమె ఒంటరిగా కాకుండా చిన్న పిల్లాడినైనా వెంట బెట్టుకొని వెళ్లి ఉంటే ఆ అఘాయిత్యం జరిగి ఉండేది కాదని వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ సెలవిచ్చిన తరణోపాయం కూడా అటువంటిదే.
పౌరుల ధన మాన ప్రాణాలను కాపాడడానికే ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని, పాలక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. శాసన, న్యాయ, పోలీసు మున్నగు ఉన్నత ఏర్పాట్లన్నీ అందుకోసం ఉద్దేశించినవే. ఇక్కడ పౌరులను స్త్రీ పురుషులుగా, ధనికులు పేదలుగా విభజించి చూడడం సమంజసం కాదు. ఈ సమాజంలో స్వేచ్ఛగా, నిర్భయంగా సంచరించే హక్కు పురుషులకే పరిమితమని మన పాలకులు చెప్పదలిస్తే అది ముమ్మాటికీ అసంగతం. ఆచరణలో ఎలా ఉన్నప్పటికీ కనీసం మాటల్లోనైనా స్త్రీలను రెండవ శ్రేణి పౌరులుగా పరిగణించడం వారికి జీవన భయాన్ని, సంచార భీతిని కలిగించడం పాలకులు మానుకోవాలి.