Sunday, February 23, 2025

విమానంలో విరిగిన సీటులోనే మంత్రి గంటన్నర ప్రయాణం

- Advertisement -
- Advertisement -

భోపాల్ : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం మండి పడ్డారు. ఇటీవల భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన సందర్భంలో తనకు విరిగిపోయిన సీటు కేటాయించారని , ఎయిర్‌లైన్ ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీలు వసూలు చేస్తున్నప్పుడు, ఇలాంటి చర్యలు ప్రయాణికులను మోసం చేయడమే అవుతుందని ఆగ్రహించారు. ఎయిర్ ఇండియా నిర్వహణ బాధ్యతలు టాటా గ్రూప్ తీసుకున్న తరువాత ఎయిర్‌లైన్ సేవలు మెరుగుపడతాయని అనుకున్నానని, కానీ అది తన అపోహే అని అర్థమైందని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

పూసాలో వ్యవసాయ ప్రదర్శనను ప్రారంభించడానికి, కురుక్షేత్రలో వ్యవసాయ సదస్సులో పాల్గొనడానికి, చండీగఢ్‌లో వ్యవసాయ సంఘ ప్రతినిధులతో చర్చలు జరపడానికి భోపాల్ నుంచి ఢిల్లీ ( ఎ1436 )విమానంలో ప్రయాణించగా ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. “విమానంలో 8 సీ సీటు ముందుగానే బుక్ చేసుకున్నానని విమానం ఎక్కిన వెంటనే నా సీటు విరిగి ఉండడంతో ఆశ్చర్య పోయాను. దీనిపై ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ప్రశ్నించగా, ఈ సమస్యను యాజమాన్యం ఆలస్యంగా గుర్తించిందని, ఈ సీటు టికెట్‌ను ప్రయాణికులకు విక్రయించకూడదని ఆదేశించిందని తెలిపారు. విమానంలో అదొక్కటే కాకుండా మరిన్ని సీట్లు కూడా సరిగా లేవని సిబ్బంది చెప్పారు” అని కేంద్ర మంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

తోటి ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోమని ఆఫర్ చేశారని , కానీ వారికి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక అదే విరిగిపోయిన సీటు లోనే గంటన్నర పాటు కూర్చొని ప్రయాణించానని తెలిపారు. ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీలు వసూలు చేసి, అసౌకర్యమైన సీట్లు కేటాయించడం ప్రయాణికులను మోసి చేసినట్టు కాదా అని మండిపడ్డారు. భవిష్యత్తులో అయినా ఎయిర్ ఇండియా యాజమాన్యం తమ ప్రయాణికులను ఇటువంటి అసౌకర్యానికి గురి కాకుండా చర్యలు తీసుకుంటుందా లేదంటే వారి అవసరాన్ని సొమ్ము చేసుకొంటుందా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ట్వీట్‌పై ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ , ఆయనకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందన
ఈ సంఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ విషయమై ఎయిరిండియాతో మాట్లాడామని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు. మా వైపు నుంచి డీజీసీఏ సైతం తగిన చర్యలు తసుకుంటోందన్నారు. మంత్రిశివరాజ్ సింగ్‌తో వ్యక్తిగతంగా మాట్లాడినట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News