భొపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి మరోమారు ఘనవిజయం సాధించిపెట్టిన సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీటు ప్రాధాన్యతను సంతరించుకుంది. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన శనివారం సబీ కో రామ్‌రామ్ అంటే అందరికి రామ్‌రామ్ అనే సందేశం వెలువరించారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికి బిజెపి తరఫున సిఎం ఎవరనేది వెల్లడికాలేదు. సోమవారం కొత్తగా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యేల కీలక సమావేశం జరుగుతుంది. ఇందులో పార్టీ శాసనసభ పక్ష నేత ఎవరనేది తేలుతుంది. ఈక్రమంలో రెండు రోజుల ముందు చౌహాన్ తమ సందేశం వెలువరించారు. సాధారణంగా రామ్‌రామ్ అనే పదాన్ని శుభాకాంక్షలకు, కొన్ని సందర్భాలలో వీడ్కోలుకు ప్రతీకాత్మక సందేశంగా వాడుతారు. ఈ సందేశంలో సిఎం చేతులు జోడిస్తూ ఉన్నప్పటి ఫోటో కూడా పొందుపర్చారు. రాజకీయ పరిశీలకులు ఈ స్పందనపై పలు విధాలుగా వ్యాఖ్యానాలకు దిగుతున్నారు.
ఇంతకు ఈ తిరుగులేని సిఎం వీడ్కోలు చెపుతున్నారా? తాను తిరిగి వస్తున్నానని తెలియచేసుకుంటున్నారా? అనేది అస్పష్టంగా నిలిచింది. కాగా సోమవారం బిజెపి ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుందని మధ్యప్రదేశ్ బిజెపి అధ్యక్షులు విడి శర్మ శనివారం తెలిపారు. దీనికి బిజెపి జాతీయ స్థాయి నేతలు హాజరవుతారు. సిఎం ఎవరనేది ఈ సందర్భంగా ఖరారు అవుతుందని శర్మ తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు జరిగే భేటీలో శాసనసభా పక్ష నేత ఎంపిక జరుగుతుందని, దీనితో సిఎం పీఠంపై సందిగ్దత వీడుతుందని వెల్లడించారు. ముగ్గురు బిజెపి కేంద్ర పరిశీలకులు సోమవారం ఉదయం ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే ఈ భేటీ గురించి ఎమ్మెల్యేలకు పార్టీ తరఫున ఆహ్వానాలు పంపించారు. సమావేశంలో పార్టీ సంప్రదాయం ప్రకారం తగు విధంగా నడవడం జరుగుతుందని, నిర్ణయం తీసుకుంటారని వివరించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దశలో బిజెపి తరచూ తాము ముందుగా సిఎం అభ్యర్థి ఎవరనేది తెలియచేయలేదు. ఇది తమ ఆనవాయితీ కాదంటూ తెలిపింది.
చౌహాన్ వల్లనే ఘన విజయం సాధ్యం అయింది. చౌహాన్ ఇప్పుడు వెలువరించిన రామ్ రామ్ వ్యాఖ్యలపై బిజెపి నేత శర్మ స్పందించారు. ఈ నేల రాముడి నేల, మన మంతా ఒకరిని ఒకరం రామ్ రామ్ అని సంబోధించుకుంటామని, మనం రోజును రామనామంతో ఆరంభిస్తామని, శివరాజ్ రామ్ రామ్ ఈ వరుసలో వెలుడిందేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకుంటారని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బిజెపి శాసనసభా పక్ష నేత ఎంపిక, తదుపరి సిఎం సస్పెన్స్ తొలిగింపు ప్రక్రియకు ఇప్పుడు కేంద్ర స్థాయి బిజెపి పరిశీలకులుగా హర్యానా సిఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ,బిజెపి ఒబిసి మోర్చా అధినేత కె లక్ష్మణ్, సెక్రెటరీ అషా లక్రాలను నియమించారు. వీరు లెజిస్లేచర్ పార్టీ నేత ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తారు.