Monday, December 23, 2024

కర్నాటకలో కాంగ్రెస్ తరఫున శివరాజ్‌కుమార్ ప్రచారం

- Advertisement -
- Advertisement -

 

శివముగ్గ: రాజకీయాలలోకి తాను ప్రవేశించడం లేదని శాండల్‌వుడ్ స్టార్ శివరాజ్ కుమార్ స్పష్టం చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఆదివారం తన బావమరిది, కాంగ్రెస్ అభ్యర్థి మధు బంగారప్ప తరఫున అనవట్టిలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు. తన భార్య గీత కాంగ్రెస్‌లో చేరారని, తనకు మాత్రం రాజకీయాలపై ఎటువంటి అవగాహన లేదని శివరాజ్‌కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలలో తనకు మిత్రులున్నారని, వారంతా ప్రజాసేవలో ముందున్నారని ఆయన తెలిపారు. వారి తరఫున తాను ప్రచారం మాత్రమే చేస్తున్నానని ఆయన చెప్పారు.

షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్న కారణంగా క్రియాశీల రాజకీయాలలో తాను చురుకుగా పాల్గొనలేకపోతున్నానని, ప్రచారానికి మాత్రమే పరిమితమవుతున్నానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులు సిద్ద రామయ్య, సిర్సి కాంగ్రెస్ అభ్యర్థి భీమన్న నాయక్, జగదీష్ షెట్టర్, విజయ్ సింగ్, అశోక్ ఖేనీ తరఫున కూడా తాను ప్రచారం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
తన తండ్రి రాజ్‌కుమార్ కు జగదీష్ షెట్టర్ వీరాభిమాని అని ఆయన తెలిపారు. హుబ్బలిలో షూటింగ్ జరిగినపుడు తాను వారింట్లోనే అల్పాహారం తీసుకునేవాడినని ఆయన తెలిపారు. శాండల్‌వుడ్ నటుడు సుదీప్ కూడా బిజెపి తరఫున ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా ఎవరికి నచ్చిన పని వారు చేస్తారని శివరాజ్‌కుమార్ బదులిచ్చారు.

Also Read: మోడీజీ.. తిట్లకే భయపడితే ఇక మీరేం నేతలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News