Thursday, January 23, 2025

గద్వాల ఎంఎల్‌ఎకు షాక్

- Advertisement -
- Advertisement -

హైకోర్టు అనర్హత వేటు… ఎంఎల్‌ఎగా డికె అరుణ!

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ గద్వాల ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి గట్టి షాక్ తగలింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆయనపై హైకోర్టు వేటు వేసింది. ఎంఎల్‌ఎగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు వెలువరిం చింది. రెండో స్థానంలో ఉన్న డికె అరుణను ఎంఎల్‌ఎగా ప్రకటించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరపున గెలిచిన కృష్ణ మోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ డికె అరుణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరపిన హైకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. తప్పుడు సమాచారం ఇచ్చిన కృష్ణ మోహన్ ఎన్నికల చెల్లదని ప్రకటించింది. అంతేకాకుండా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కృష్ణమోహన్‌రెడ్డికి రూ.2.5 లక్షల జరిమానా విధించింది. పిటిషనర్ డికె అరుణకు పిటిషన్ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని ఆదేశించింది. 2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి 1,00,415 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న డికె అరుణకు 72,155 ఓట్లు పోలయ్యాయి. సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ తరపున బరిలో ఉన్న అబ్జుల్ మోహిద్ ఖాన్ కు 7,189 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి 28,445 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక డికె అరుణ ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు.

కొద్దిరోజుల కిందటే కొత్తగూడెం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ వనమా కేసులో ఇదే తరహా తీర్పు వచ్చింది. కొత్తగూడెం నియోజకవర్గంలో 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు బిఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలో ఎన్నిక అఫిడవిట్‌లో వనమా వెంకటేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని జలగం గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా వనమా బిఆర్‌ఎస్ పార్టీలో చేరిపోయారు. అనేక వాదనలు విన్న తర్వాత ఈ ఏడాది జులై 25న వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని ప్రకటిస్తూ హైకోర్టు తీర్పును వెల్లడించింది. అనంతరం రెండో స్థానంలో ఉన్న జలగం వెంకటరావును ఎంఎల్‌ఎగా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వనమా హైకోర్టులో స్టే కోరితే నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా వెంకటేశ్వరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News