Monday, December 23, 2024

అరెస్టు చేయొద్దని ఆదేశాలివ్వలేం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపి అవినాష్‌రెడ్డి బెయిల్ వ్యవహారంపై వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా, అవినాష్ తరపున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న సిజెఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కనబెట్టింది. అవినాష్ ముందస్తు బెయిల్‌ను నిలిపివేసింది. తెలంగాణ హై కోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని స్పష్టం చేసింది. సిబిఐకి హైకోర్టు అలాంటి ని బంధనలను విధించడం సరికాదని పేర్కొంది. హైకోర్టు ఆదేశాల వల్ల సిబిఐ దర్యాప్తుపైనా ప్ర భావం పడుతుందన్న సుప్రీం జూన్ నెలాఖరు వరకు సిబిఐ దర్యాప్తు గడువును పొడిగించింది. అయితే తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఎంపి తరఫు లాయర్లు సిజెఐ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. మంగళవారం హైకోర్టులో విచారణ ఉన్నందున, మంగళవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు ఇవ్వాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, మీ రిక్వెస్ట్ మన్నిస్తే ఉత్తర్వులు పరస్పరం విరుద్ధంగా ఉంటాయని సిజెఐ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి కేసులను ప్రభావితం చేసేలా అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఉత్తర్వులు ఇవ్వకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ అధికారులు ఈ నెల 16న నోటీసులు జారీ చేశారు. రెండ్రోజుల వ్యవధిలోనే ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయడంతో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దంటూ సిబిఐని అదేశించింది. అయితే అప్పటి వరకు సిబిఐ కార్యాలయంలో ప్రతిరోజూ విచారణకు హాజరుకావాలని అవినాష్‌రెడ్డికి షరతు విధించింది. అవినాష్ ప్రశ్నలను రాతపూర్వకంగా ఇవ్వాలని, విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని సిబిఐకి ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న తుది ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది. దీనిపై వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News