నాలుగురెట్లు పెరిగిన ఫ్లైట్ ధరలు
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే వారికి షాక్
ప్రత్యామ్నాయ మార్గంలో హైదరాబాద్ రావడానికి బిఆర్‌ఎస్ నాయకుల, కార్యకర్తల అన్వేషణ
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన బిఆర్‌ఎస్ ప్రయాణికులకు ప్లైట్ టికెట్‌లు షాక్‌కు గురి చేస్తున్నాయి. బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి రాష్ట్రం నుంచి బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో ఢిల్లీకి తరలి వెళ్లడంతో పలు సంస్థలు ప్లైట్ టికెట్ ధరలను ఆమాంతం పెంచేశాయి.
ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చే టికెట్ ధరలను నాలుగింతలు ప్లైట్‌ల యజమానులు పెంచడంతో కొంతమంది కార్యకర్తలు, నాయకులు అక్కడే ఉండిపోయారు. రూ.30 వేల నుంచి రూ.40 వేల పైచిలుకు ధర నిర్ణయించడంతో కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహానికి గురయ్యారు. ప్రస్తుతం టికెట్ ధరలు ఎక్కువని భావించే వారంతా రైలు లేదా వివిధ మార్గాల్లో హైదరాబాద్ రావడానికి తమవంతు ప్రయత్నాలను ప్రారంభించారు.