Wednesday, January 22, 2025

షూటర్ తారా సహదేవ్ కేసులో మాజీ భర్తకు జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

రాంచీ : జాతీయ స్థాయి అథ్లెట్, షూటర్ తారా సహదేశ్ బలవంతపు మతమార్పిడికి సంబంధించిన కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆమె మాజీ భర్తతోపాటు మరో ఇద్దర్ని దోషులుగా తేల్చిన న్యాయస్థానం వారికి తాజాగా శిక్ష ఖరారు చేసింది. ఆమె మాజీ భర్త రకీబ్‌ఉల్ హసన్ అలియాస్ రంజిత్ కోహ్లీకి జీవిత ఖైదు విధించింది. హసన్ తల్లి కౌసర్ రాటనికి 10 ఏళ్లు, మరో నిందితుడు ముస్తాఖ్ అహ్మద్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు పూర్వాపరాలకు వెళ్తే…ఝార్ఖండ్‌కు చెందిన తారా సహదేవ్ జాతీయ స్థాయి షూటర్‌గా రాణిస్తోంది. ఆమెకు కొన్నేళ్ల క్రితం రంజిత్ కోహ్లీ అనే పేరుగల వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారి,, 2014 జులైలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన కొన్ని రోజులకే తారాకు సంచలన విషయాలు తెలిశాయి.

తన భర్త అసలు పేరు రకీబ్ ఉల్ హసన్ అని తెలిసింది. అదే సమయంలో తారా మతం మార్చుకోవాలని రకీబ్‌ఉల్ ఆమెపై ఒత్తిడి పెంచాడు. దీంతో ఆమె 2014 ఆగస్టులో తన భర్త, అత్తపై కేసు పెట్టింది. రకీబ్ ఉల్ తనను మోసం చేసి వివాహం చేసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మతం మార్చుకునేందుకు అంగీకరించక పోవడంతో తనను శారీరకంగా హింసించారని ఆరోపించింది. ఝార్ఖండ్ హైకోర్టులో అప్పటి విజిలెన్స్ రిజిస్ట్రార్‌గా ఉన్న ముస్తాఖ్ అహ్మద్… తన అత్తింటి వారికి సహకరించాడని తారా పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఝార్ఖండ్ హైకోర్టు … 2015లో కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించింది. సిబిఐ దర్యాప్తు చేపట్టాక, సుదీర్ఘ విచారణ తరువాత ఈ కేసులో రకీబ్‌ఉల్ హసన్, అతడి తల్లి కౌసర్ రాణి, మరో నిందితుడు ముస్తాఖ్ అహ్మద్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు గత వారం దోషులుగా తేల్చింది. తాజాగా వీరికి శిక్షఖరారు చేసింది. ఇదిలా ఉండగా, 2018 లో రాంచీ లోని ఫ్యామిలీ కోర్టు తారాకు విడాకులు మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News