Monday, December 23, 2024

మిచిగాన్ యూనివర్శిటీలో కాల్పులు.. ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

ఈస్ట్‌లాన్సింగ్(అమెరికా): ఈస్ట్‌లాన్సింగ్ లోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్ లోకి సోమవారం రాత్రి 8. 30 గంటల ప్రాంతంలో సాయుధుడైన ఆగంతకుడు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని గంటల పాటు దుండగుడు మనుషులను వెతికి వేటాడటంతో విద్యార్థులు భయంతో గదుల్లో చీకటిలో దాక్కోవలసి వచ్చింది. ఆ తరువాత ఆగంతకుడు తనకు కాల్చుకుని చనిపోయాడు. కాల్పులు జరిపిన నాలుగు గంటల తరువాత మంగళవారం తెల్లవారు జామున ఆగంతకుడు మరణించాడని పోలీసులు చెప్పారు. క్యాంపస్ లోని రెండు భవనాల వద్ద కాల్పులు జరిగాయి.

మొదట యూనివర్శిటీ అకడమిక్ భవనం బెర్కీ హాలులో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఆ తరువాత ఎంఎస్‌యు యూనియన్ వద్ద జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. రాత్రి 10.15 గంటలకు బెర్కీ హాలుతోపాటు సమీపాన గల నివాస హాల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ఈస్ట్‌లాన్సింగ్ క్యాంపస్‌లో వందలాది మంది అధికారులను ఖాళీ చేయించి దుండగుడు కోసం వెతికామని చెప్పారు. నిందితుడు పొట్టిగా నల్లగా ఉన్నాడని, ఎర్రని షూలు వేసుకున్నాడని, జీన్ జాకెట్, బాల్ కేప్ ధరించాడని పోలీసులు వివరించారు.

నిందితునికి ఎంతవరకు యూనివర్శిటీతో సంబంధం ఉందో, అతడు ఎందుకు ఈ నరమేథానికి పాల్పడ్డాడో ఇంకా తెలియవలసి ఉందని క్యాంపస్ పోలీస్ విభాగం తాత్కాలిక డిప్యూటీ చీఫ్ క్రిస్ రోజ్‌మన్ పేర్కొన్నారు. గాయపడిన ఐదుగురి పరిస్థితి ఎలా ఉందో తనకు తెలియదని స్పారో ఆస్పత్రి అధికార ప్రతినిధి జాన్ ఫోరెన్ చెప్పారు.అమెరికాలో అతిపెద్ద ఉన్నత విద్యాసంస్థల్లో మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ ఒకటి. కాల్పులు జరిగిన ఈస్ట్ లాన్సింగ్ క్యాంపస్‌లో 50 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ సంఘటన తరువాత క్యాంపస్‌లో అన్ని తరగతులు, ఇతర కార్యక్రమాలు, క్రీడలను 48 గంటల పాటు రద్దు చేసినట్టు యూనివర్శిటీ పోలీస్‌లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News