ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
అగ్రరాజ్యంలో మారని గన్ కల్చర్
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్లోని ఒక స్కూల్లో ఓ విద్యార్థి కాల్పులు జరపడంతో నలుగురు గాయపడ్డారు. వారాలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆర్లింగ్టన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం-డల్లాస్ పరిధిలోని అర్లింగ్టన్లోని టింబర్వ్యూ హై స్కూల్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తిమోతీ జార్జ్ సింప్కిన్స్(18) అనే విద్యార్థి తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడని తెలుస్తోంది. సహ విద్యార్థులతో ఏర్పడిన ఘర్షణ నేపథ్యంలోనే అతడు ఈ కాల్పులకు దిగినట్లు సమాచారం.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన విద్యార్థి తిమోతీని అదుపులోకి తీసుకున్నారు. 1900 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో కాల్పుల కారణంగా భయానక వాతావరణం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని విధానాలు పాటించిన అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి మారడంలేదు.